మారని తీరు.. హరీశ్ రావు మీటింగ్‌లోనూ ‘సేమ్’ సీన్ రిపీట్

by Shyam |   ( Updated:2021-06-30 05:45:19.0  )
siddipet
X

దిశ ప్రతినిధి, మెదక్ : మహిళా సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయినా కొందరు తమ తీరు మార్చుకోవడం లేదు. మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి కుటుంబ సభ్యులే పాల్గొంటున్నారు. ఈ విషయంపై ‘దిశ’ పలు కథనాలను ప్రచురించింది. సిద్దిపేట మున్సిపల్ సమావేశంలోనూ ఓ మహిళా కౌన్సిలర్‌కు బదులు వారి భర్త హాజరు కావడంపై, దుబ్బాక పట్టణంలోని 20వ వార్డులో ఓ గోడపై మహిళ కౌన్సిలర్‌కు బదులు వారి భర్త పేరు రాయడాన్ని ‘దిశ’ మీడియా ‘సతులకు బదులు పతులు’ అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీనిపై కొందరు ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నాయకులు స్పందించారు. అయినా, కొందరు వారి తీరు మార్చుకోవడం లేదు. బుధవారం పల్లె, పట్టణ ప్రగతి సమావేశాన్ని గజ్వేల్ మహతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఆ సమావేశంలోనూ చాలా మంది మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొనలేదు. వారికి బదులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దీనిపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మంత్రి పాల్గొన్న సభలో..

నేటి నుంచి ప్రారంభమయ్యే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన అంశాలపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చాలా మంది మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి కుటుంబ సభ్యులు పాల్గొనడంపై ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విమర్శిస్తున్నారు. మంత్రి పాల్గొన్న సమావేశంలో మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి కుటుంబ సభ్యులు పాల్గొంటే మందలించాల్సింది పోయి.. ఏమీ అనకపోవడం ఏంటని పలువురు మంత్రిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed