వ్యాక్సిన్ సెంటర్ వివరాలతో.. ‘MyGov చాట్‌బోట్’

by Shamantha N |
వ్యాక్సిన్ సెంటర్ వివరాలతో.. ‘MyGov చాట్‌బోట్’
X

దిశ, ఫీచర్స్ : దేశంలో అదుపు లేకుండా వ్యాపించిన కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే, వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే తొలి దశలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో పాటు సీనియర్ సిటిజన్స్‌కు టీకా కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మే 1 నుంచి 18 – 44 సంవత్సరాల వయస్సు గల పౌరులకు టీకాలు వేయడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మనం నివాస ప్రాంతానికి దగ్గరలో అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ సెంటర్ల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రభుత్వం వాట్సాప్‌లో చాట్‌బోట్‌ను ప్రారంభించింది.

కొవిడ్ మహమ్మారి కారణంగా బాధపడుతున్న భారతీయులకు సంఘీభావం తెలుపుతూ ఆదివారం వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ ట్వీట్ చేయడంతో పాటు ఆరోగ్య భాగస్వాములతో కలిసి ప్రజలకు హెల్ప్‌లైన్‌గా ఉపయోగపడే చాట్‌బోట్ సేవలందిస్తున్నట్టు వెల్లడించాడు. ఈ చాట్‌బోట్స్‌లో ‘మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ చాట్‌బోట్(MyGov Corona Helpdesk chatbot) కూడా ఉండగా, దీన్ని గతేడాది ప్రారంభంలోనే ప్రారంభించారు. కాగా టీకా కేంద్రాన్ని కనుగొనడంలో ప్రజలకు సాయపడేందుకు వీలుగా ప్రస్తుతం ఈ సేవను నవీకరించారు. ఈ మేరకు ఈ యాప్ డౌన్‌లోడ్స్ సంఖ్య ఇటీవల 30 మిలియన్లకు చేరింది.

వినియోగదారులు ‘మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ చాట్‌బో‌ట్‌’ను ఉపయోగించాలంటే.. మొబైల్‌లో +919013151515 నంబర్‌ను సేవ్ చేసి, ఆపై ‘నమస్తే(హలో లేదా హాయ్)’ అని టైప్ చేసి చాట్‌ను ప్రారంభించాలి. ఈ క్రమంలో చాట్‌బోట్ ప్రతిస్పందించడానికి కొన్ని క్షణాలు వేచి ఉండాలి. ఆ తర్వాత ఇది వినియోగదారుల పిన్ కోడ్ అడుగుతుంది. కస్టమర్ ఆ కోడ్‌ను సెండ్ చేయగానే, సమీపంలోని టీకా కేంద్రాల జాబితాతో ప్రతిస్పందిస్తుంది.

ఒకవేళ వినియోగదారులు చాట్‌బోట్ కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేయకూడదనుకుంటే.. వారు wa.me/919013151515ను కూడా సందర్శించవచ్చు. దీంతో నేరుగా చాట్‌బో‌ట్‌ అప్లికేషన్‌కు వెళ్లే అవకాశం ఉండగా.. ఇదివరకే ప్రోగ్రామ్ చేసిన ఉపయోగకరమైన సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మీకు సమీప కేంద్రం వంటి ప్రాథమిక సమాచారం త్వరగా అవసరమైనప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed