ఈపీఎఫ్ కోసం డిజిటల్ వ్యవస్థ!

by vinod kumar |
ఈపీఎఫ్ కోసం డిజిటల్ వ్యవస్థ!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి కారణంగా దేశంలోని అనేక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, పీఎమ్ గరీబ్ కళ్యాణ్ యోజన(పీఎమ్‌జీకేవై) కింద తన సామాజిక భద్రతాపథకాల్లో ఉద్యోగుల, కంపెనీల వాటాను జమ చేసేందుకు ఉద్యోగి భ‌విష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ఆన్‌లైన్ వ్యవస్థను తెచ్చింది. ఈ ఆన్‌లైన్ వ్యవస్థ వల్ల సుమారు 79 లక్షల మంది వినియోగదారులు, 3.8 లక్షల సంస్థలకు ప్రయోజనం ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం రూ.4,800 కోట్లను జమ చేయనుంది. తక్కువ జీతం ఉన్న ఉద్యోగుల, సంస్థల వాటా ఉద్యోగి భ‌విష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో)లో ప్రభుత్వమే జమ చేస్తుందని ఇదివరకే ప్రకటించింది.

ఈ క్రమంలోనే వినియోగదారుల ఈపీఎఫ్, ఈపీఎస్ అకౌంట్లలో ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగులు, సంస్థల వాటా జమ అయ్యేందుకు డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రయోజనాలు పొందాలంటే అర్హత ఉన్న కంపెనీలు ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్(ఈసీఆర్)ను ఇవ్వాలని తెలిపింది. మూడు నెలలకు సంబంధించి ఉద్యోగులు, సంస్థలు చెల్లించాల్సిన మొత్తాన్ని ఈపీఎఫ్ ఉన్న వారి యూఏఎన్ అకౌంట్లలో ప్రభుత్వమే జమ చేయనుంది. ఈ ప్రయోజనం పొందాలంటే వందలోపు ఉద్యోగస్తులున్న సంస్థల్లో రూ. 15 వేల కంటే తక్కువ వేతనమున్న ఉద్యోగులకు వర్తిస్తుంది.

ఉపశమనం ఎలాగంటే..

ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్(ఈసీఆర్) ఫైల్ చేసే సంస్థల్లో అర్హతగల ఉద్యోగులు ఉపశమనం పొందటానికి వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏదైనా అర్హత కలిగిన సంస్థ యజమాని, ఉద్యోగులకు నెలకు వేతనాలు పంపిణీ చేసిన తర్వాత ఈ పథకం కింద ప్రయోజనం పొందటానికి అవసరమైన సర్టిఫికేట్, డిక్లరేషన్‌తో ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ఈసీఆర్)ను దాఖలు చేయాలి.

అర్హతగల ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉపశమనం కోసం ఈసీఆర్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత యజమాని చెల్లించాల్సిన మిగిలిన మొత్తానికి చలాన్ చూపిస్తుంది. ఇది సంస్థ, ఉద్యోగుల అర్హతను ధృవీకరిస్తుంది. చలాన్‌లో ఉన్న విధంగా యజమాని అతని నుంచి చెల్లించాల్సిన చెల్లింపు తర్వాత, ఈపీఎఫ్, ఈపీఎస్‌లను కేంద్ర ప్రభుత్వం నేరుగా సంస్థలో అర్హతగల ఉద్యోగుల యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నెంబ‌రు(యూఏఎన్‌) ఖాతాల్లో జమ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివిధ అంశాలపై స్పష్టమైన విషయాలూ, సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్‌లో ‘covid-19’ విభాగం కింద అందుబాటులో ఉన్నాయి.

Tags: EPFO, epf online, pm garib kalyan yojana

Advertisement

Next Story