వెల్‌నెస్ అసెస్‌మెంట్@సెల్ఫ్ డిస్కవరీ

by Shyam |   ( Updated:2021-07-07 20:37:36.0  )
వెల్‌నెస్ అసెస్‌మెంట్@సెల్ఫ్ డిస్కవరీ
X

దిశ, ఫీచర్స్ : వస్తువులను సంపాదించేందుకు పోటీ పడుతున్న మోడర్న్ మ్యాన్.. జీవితాన్ని ఆస్వాదించేందుకు మాత్రం సమయం లేదంటున్నాడు. గజిబిజిగా పరుగులెడుతున్న మనిషి.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. తాను చేస్తున్న తప్పుల్ని, చేయలేని ఒప్పుల్ని అంచనా వేయొచ్చు. తనను తాను ఆవిష్కరించుకుంటూనే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. నేటి జీవనశైలికి ‘సెల్ఫ్ అసెస్‌మెంట్’ ఎంతో అవసరం. సెల్ఫ్ డిస్కవరీ.. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై దృష్టిపెట్టేలా చేస్తుంది. మేధోపరమైన, భావోద్వేగ సహిత ఆలోచనలు రేకెత్తిస్తుంది. సామాజిక, ఆధ్యాత్మిక, శారీరక, మానసిక అంశాల పరంగా మనలోని శక్తిని మరోసారి తట్టిలేపుతుంది. లోపాలను పట్టి చూపించి, గట్టి మేలు తలపెడుతుంది. నిన్నే నీకు కొత్తగా పరిచయం చేసి, జీవితాన్ని ఆనందాయకంగా, అనుభవాల మూటగా జీవించేందుకు దోహదపడుతుంది. పాతికేళ్ల చదువు, మూడు‌ పదుల ఉద్యోగానికే కాదు.. వ్యక్తిగత జీవితానికి కూడా ‘సెల్ఫ్ అసెస్‌మెంట్’ అవసరం. ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జిందగీ కోసం వెల్‌నెస్ అసెస్‌మెంట్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

‘లక్ష్యం’ ఏదైనా దాన్ని సాధించడానికి రెగ్యులర్ అసెస్‌మెంట్ చాలా కీలకం. ఉదాహరణకు.. వేగాన్ని పెంచుకోవాలనుకునే ‘లాంగ్ డిస్టెన్స్’ రన్నర్స్ తరచూ ప్రాక్టీస్ చేస్తుంటారు. భిన్నరకాల అసెస్‌మెంట్స్ పూర్తి చేస్తుంటారు. ఈ క్రమంలో ఎక్కడ మెరుగుపడాలో తెలుసుకోవడానికి టైమ్ ట్రాక్ చేస్తారు. వారి ప్రోగ్రెస్ మానిటర్ చేసేందుకు, కెరీర్ బెస్ట్ టైమ్ సాధించడానికి, ఇంకా ఎలాంటి మార్పులు అవసరమో తెలుసుకోవడానికి ఈ ‘రివ్యూ’ ఉపయోగపడుతుంది. అలానే బిగ్ కార్పొరేట్ సంస్థలలోని ఉద్యోగులు వారి వ్యక్తిగత, కార్పొరేట్ లక్ష్యాలను చేరుకోవడానికి ఆబ్జెక్టివ్స్ పూర్తి చేస్తుంటారు. ఇండివిడ్యువల్స్‌తో పాటు టీమ్‌ల వారీగా ప్రతీ మూడు నెలలకోసారి సమీక్షలు జరుపుతారు. రైట్ ట్రాక్‌లోనే ఉన్నారా? ఎక్కడ లోపాలున్నాయి? ఇంకా ఏమేం చేయొచ్చు తదితర అంశాలను రివ్యూ చేస్తారు. ఇదే మాదిరిగా వ్యక్తిగత జీవితానికి కూడా సెల్ఫ్ అసెస్‌మెంట్ ప్రధానం.

‘వెల్‌నెస్’ అంటే.. అనారోగ్యం లేదా బాధ లేకపోవడమో కాదు. బ్యాలెన్స్‌డ్ (సమతుల్య), అర్ధవంతమైన జీవితాన్ని గడపడానికి నిర్ణయాలు తీసుకునే జీవితకాల ప్రక్రియ. మన ఆరోగ్యాన్ని పెంచడానికి ఎల్లప్పుడూ అనేక అవకాశాలుంటాయి. మన ప్రస్తుత స్థితిని అంచనా వేయడంతో పాటు, మార్గనిర్దేశం చేయడానికి తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా మెరుగైన జీవితాన్ని పొందొచ్చు. శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక, ఆర్ధిక అంశాల పరంగా ఒక వ్యక్తి పూర్తి‌సామర్థ్యాన్ని గ్రహించడంతో పాటు, కుటుంబం, సమాజం, ఉద్యోగ సంస్థల్లో అతడు నిర్వర్తించే బాధ్యతలపై పర్‌ఫెక్ట్ అసెస్‌మెంట్ చేయాలి.

ఆయా శారీరక, భావోద్వేగ అంశాల రివ్యూ మన ఆరోగ్యం, వెల్‌నెస్ మీద ప్రభావం చూపుతుంది. మానసిక శ్రేయస్సుకు, సంతృప్తికరమైన జీవనానికి ‘సెల్ఫ్ కేర్’ పునాదిగా గుర్తుంచుకోండి. వెల్ డిజైన్డ్ అసెస్‌మెంట్.. ఈ అంశాలన్నీ కూడా మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేస్తాయి. ఈ వెల్‌నెస్ అసెస్‌మెంట్ ద్వారా మీ ఆరోగ్యానికి సంబంధించిన ఫుల్ పిక్చర్ పొందడంతో పాటు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటానికి మీరు ఏయే సర్దుబాట్లు చేయవచ్చో సమగ్ర అంచనా మీకు తెలియజేస్తుంది. రెగ్యులర్ వెల్‌నెస్ అసెస్‌మెంట్స్ వల్ల నిత్యం ఆరోగ్యంగా ఉండొచ్చు.

దీర్ఘాయువు..

ఇది మీ దీర్ఘాయువుపై నియంత్రణ సాధించడానికి దోహదపడుతుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వ్యక్తిగతీకరించిన పరిష్కారాలతో కూడిన వెల్‌నెస్ అసెస్‌మెంట్ ఫలితాలు మీ దీర్ఘాయువును నియంత్రించటానికి మిమ్మల్ని శక్తివంతం చేస్తాయి.

స్టాపింగ్ బ్యాడ్

బిజీ లైఫ్ షెడ్యూల్‌ వల్ల చాలామంది వ్యాయామం చేయడం లేదు. మరికొంతమంది మద్యపానం, ధూమపానం వల్ల ఆరోగ్యాన్ని పాడు‌చేసుకుంటున్నారు. ఆయా అలవాట్లు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకుంటే వాటిని ఆపడానికి నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది.

ఎమోషనల్ హెల్త్

ఒక వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడో.. లేదో.. ‘సెల్ఫ్ అసెస్‌మెంట్’ ద్వారా తెలుసుకోవచ్చు. భావోద్వేగాల ప్రదర్శన ఆధారంగా సదరు వ్యక్తి నిరాశలో ఉన్నాడా, ఒత్తిడికి గురవుతున్నాడా అంచనా వేయొచ్చు. సెల్ఫ్ అసెస్ చేయడం ద్వారా మానసికంగా వచ్చే ఆరోగ్య సమస్యలను ముందుగానే ఊహించి, తగిన ట్రీట్‌మెంట్ పొందొచ్చు.

ఈజ్ సోషల్లీ వెల్

ఒక వ్యక్తి సమాజంలోని ఇతర వ్యక్తులతో, పరిసరాలతో పెంచుకునే బంధాలు, పంచుకునే ఆలోచనలు వెల్‌నెస్ అసెస్‌మెంట్ అందిస్తుంది. ఇతరుల భావాలకు ఎంత విలువనిస్తున్నారు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్ట్రేంజర్స్‌‌తో ఎలా సంభాషిస్తున్నారు. ఎలా మూవ్ అవుతున్నారు ఇది పర్యవేక్షిస్తుంది. అంతేకాదు లక్ష్యం కోసం ఎంతలా ప్రయత్నం చేస్తున్నాం, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉందా? ఆలోచనా‌సరళి ఏ విధంగా ఉంది? వంటి విషయాలు తెలుసుకోవచ్చు. రాజకీయ, సామాజిక, మత, ఎథికల్ బిలీఫ్స్‌ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే రేషనల్ డెసిషన్స్ (హేతుబద్ధమైన నిర్ణయాలు) తీసుకోవడంలో మనం తరచుగా విఫలమవుతుంటాం. ఈ చిన్నపాటి నిర్లక్ష్యమే భవిష్యత్తులో పెద్ద ప్రమాదంగా మారవచ్చు. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెబుతుంటారు. కొవిడ్ కాలాన్నే ఉదాహరణగా తీసుకుంటే.. యువతతో పాటు, టీనేజర్స్ కూడా అధిక సంఖ్యలో మానసిక ఆందోళనతో బాధపడ్డారు. ఇది తీవ్రమైన మానసిక ఆరోగ్య విపత్తును సూచించింది. మన పాఠ్యాంశాల్లో ‘మెంటల్ వెల్ బీయింగ్’ అనే కాన్సెప్ట్ ఎక్కడా కనిపించదు. దీని గురించి ఎవరూ చర్చించారు. ఎవరో నేర్పించాలని కాదు, జీవితమే ఓ పాఠం. నేర్చుకుంటూ పోతే ప్రతి విపత్తును అవలీలగా ఎదుర్కొవచ్చు. అదే సెల్ఫ్ అసెస్‌మెంట్.

వెల్‌నెస్ అంచనాను నిజాయితీగా పూర్తి చేసి, ఫలితాల ఆధారంగా వ్యక్తుల సామర్థ్యం మేరకు జీవనశైలి మార్పులను అనుమతిస్తే బెటర్ లైఫ్ పొందొచ్చు. ఈ ఆరోగ్య నివేదిక ద్వారా ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు.

ఆరోగ్యం, వెల్‌నెస్ రెండు ఒకటే అని చాలామంది భావిస్తారు. కానీ ఇవి వేర్వేరు భావనలు. ‘మన ఆరోగ్యం వెల్‌నెస్ మీద ఆధారపడి ఉంటుంది’. ది వరల్డ్ హెల్త్ ప్రమోషన్ యూనిట్ ప్రకారం వెల్‌నెస్ అంటే.. ‘వ్యక్తులు, సమూహాల సరైన ఆరోగ్య స్థితి’.

Advertisement

Next Story

Most Viewed