పాలకుల అలసత్వం.. కాంట్రాక్టర్ల కక్కుర్తి

by Shyam |
పాలకుల అలసత్వం.. కాంట్రాక్టర్ల కక్కుర్తి
X

దిశ, ఎల్బీనగర్: ఇటీవల వరుసగా కురుస్తోన్న వర్షాలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సురాబాద్, హయత్నగర్ డివిజన్లలో కొన్ని ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో కాలనీవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిరుపేదలు నివాసముంటున్న కాలనీలపై అధికారులు, ప్రజాప్రతినిధులు చిన్నచూపు చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎల్బీనగర్ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం, స్థానిక ప్రజాప్రతినిధుల అలసత్వం, కాంట్రాక్టర్ల కక్కుర్తికి సాధారణ ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు.

హయత్‌నగర్ డివిజన్, బంజారాకాలనీలో వరదనీటిని మళ్లించేందుకు రూ.4 కోట్ల వ్యయంతో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద అధికారులు వరద కాలువను నిర్మించారు. బ్యాంకు కాలనీ కమాన్, విద్యుత్ సబ్ స్టేషన్ మధ్య ఉన్న వరద కాలువను రంగనాయకులగుట్ట వరకూ నిర్మించినప్పటికీ స్థానికులకు మాత్రం వరదనీటి ఇబ్బందులు తప్పడం లేదు. బంజారాకాలనీ కల్వర్టు వద్ద చేరుతున్న వరదనీటిని మళ్లించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో పలువురి ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరదనీరు చేరడంతో ఇళ్లలోని సామగ్రి, ఆహార పదార్థాలు తడిసిపోయాయి.

దీంతో ఆయా కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు ముందుచూపు లేకపోవడంతోనే వరదనీరు ఇళ్లలోకి వచ్చి చేరుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై రూ.కోట్లు ఖర్చు పెట్టిన వరద కాలువను నిరూపయోగంగా నిర్మించారని వారు మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed