కొవిడ్ కేర్ సెంటర్‌గా మారిన హోటల్

by Shyam |   ( Updated:2020-08-02 22:40:05.0  )
కొవిడ్ కేర్ సెంటర్‌గా మారిన హోటల్
X

దిశ, న్యూస్ బ్యూరో: చాలా ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులకు చికిత్స పేరిట రూ.లక్షలు గుంజుతున్నాయి. పూర్తి బిల్లు చెల్లించే దాకా శవాన్ని కూడా ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. పైగా కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోన్న క్రమంలో హోటళ్లన్నీ మూత పడే స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో హోటళ్లనూ కొవిడ్ రోగులకు సేవలందించే కేంద్రాలుగా మారుతున్నాయి. మానవతా దృక్పథంతో తక్కువ ధరలకే సంరక్షణ బాధ్యతలను చేపట్టేందుకు హైదరాబాద్‌లో ఓ సంస్థ ముందుకొచ్చింది. బేగంపేట చిరాన్ ఫోర్ట్ క్లబ్ దగ్గరున్నహోటల్ మానస సరోవర్ ‘జితో కొవిడ్ కేర్ సెంటర్’గా మారుతోంది. తక్కువ లక్షణాలున్న కొవిడ్-19 రోగులకు చికిత్స, సేవలందించే ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం నుంచి కరోనా రోగులకు సేవలందించనుంది. జితో(జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) ప్రపంచ వ్యాప్తంగా జైనుల సంస్థ. అహింసా జైన సూత్రాలను ప్రచారం చేస్తోంది. అలాగే అన్ని జీవుల పట్ల కరుణతో శాంతియుత ప్రపంచం కోసం స్వచ్ఛంద సంస్థలను నడుపుతోంది. ఈ సేవలను సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి బిల్లు చూసి పారిపోయే దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జితో అత్యంత తక్కువ ధరలకే పరిష్కార మార్గాన్ని చూపించేందుకు సిద్ధపడింది. సింగిల్, డబుల్ షేరింగ్ ఆక్యుపెన్సీని కొవిడ్ రికవరీ ఏడు రోజుల ప్యాకేజీని కేవలం రూ.28 వేల నుంచి రూ.35 వేలకే అందిస్తోంది. రోగుల ఆర్థిక స్థోమత ఆధారంగా ధరలను నిర్ణయిస్తారు. సింగిల్ రూం ఖర్చులను ఏడు రోజులకు వ్యక్తికి రూ.35 వేలు(జీఎస్టీతో సహా) ప్యాకేజీ, ట్విన్ షేరింగ్ రూం ఏడు రోజుల ప్యాకేజీకి వ్యక్తికి రూ.28 వేలు(జీఎస్టీ తో సహా)గా నిర్ణయించారు. ప్యాకేజీలో భాగంగా భోజనం, మందులు, చికిత్స వంటి సదుపాయాలను కల్పించనుంది. పైగా జితో కరోనా కేర్ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అనుమతులు పొందింది. మహావీర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సహకారంతో ఈ సదుపాయాలను కల్పిస్తోంది. కొవిడ్ కేర్ సెంటర్‌ సోమవారం నుంచి అందుబాటులోకి వస్తోంది.

ఆసుపత్రికి బదులుగా..

కొవిడ్-19 ప్రపంచాన్ని తలకిందులు చేస్తోంది. మొదట లాక్‌డౌన్, ఉద్యోగం, వ్యాపారంలో నష్టం.. ఇప్పుడేమో ఆసుపత్రిలో చేరే దుస్థితి. ఇవన్నీ ఒక చోట చేరితో ఎంత నష్టమో ఊహించడం కష్టం. జితో కేర్ సెంటర్ ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా పని చేస్తుంది. ప్రస్తుతం కొవిడ్ పాజిటివ్ టెస్టు రిపోర్టు ఆధారంగా 15-55 సంవత్సరాల మధ్య వయసు కలిగి మైల్డ్ లక్షణాలున్న వారికి మాత్రమే సదుపాయాలను కల్పిస్తుంది. అత్యవసర వినియోగం కోసం ఆక్సిజన్ సదుపాయాన్ని అందిస్తుంది. కేంద్రంలో చేరిన ప్రతి ఒక్కరికీ పర్సనల్ మెడికల్ కిట్ అందిస్తారు. వైద్యులు, నర్సులు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచుతారు. రోజంతా ఇంట్లో మాదిరిగా ఆరోగ్యకరమైన శాకాహార భోజనం, అల్పాహారం వంటివి సప్లయి చేస్తుంది. మానవతా దృక్పథంతోనే కొవిడ్ రోగులకు సేవలందించే లక్ష్యంతో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జితో ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed