బీటెక్ విద్యార్థిని రమ్య హత్యపై స్పందించిన హోంమంత్రి సుచరిత

by srinivas |   ( Updated:2021-08-15 06:02:58.0  )
sucharitha
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని హత్య కలకలం సృష్టించింది. ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్ ఆదేశాలతో జీజీహెచ్‌లో బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత పరిశీలించారు. రమ్య కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీటెక్ విద్యార్థిని రమ్యను హత్య చేయడం బాధాకరమని అన్నారు. హంతకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారని తెలిపారు. ఇప్పటికే నిందుతుడికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించారు.

ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. హత్య కు ముందు యువతితో నిందితుడు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. మహిళలను చంపే హక్కు ఎవరికీ లేదు. ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి. అంతేకాని ఉన్మాదుల్లా హత్య చేయడం అత్యంత దారుణం. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.. ఉన్మాదంతో దారుణాలకు తెగబడుతున్న ఇలాంటి వాళ్ళను ఏ విధంగా శిక్షించాలో తెలియడం లేదు. ఇటువంటి ఉన్మాదులకు ఉరిశిక్షే సరైన శిక్షలా అనిపిస్తోంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనపై సీఎం జగన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమ్య కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా పోలీసులు విచారించినట్లు హోంమంత్రి సుచరిత తెలిపారు.

స్వాతంత్ర్యదినోత్సవం రోజున హత్య జరగడం దురదృష్టకరం : మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ
కత్తిపోట్లతో దారుణ హత్యకు గురైన రమ్య మృతదేహాన్ని జీజీహెచ్‌లో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలో పట్టపగలు స్వాత్రంత్ర దినోత్సవం రోజున ఈ దుర్ఘటన జరగడం అత్యంత బాధాకరం, దురదృష్టం. హత్య ఘటనపై జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని పేర్కొన్నారు. మెడ పైన, పొత్తి కడుపులో ఆరు చోట్ల కత్తి తో తీవ్రంగా గాయపరచడం వల్ల రమ్య వెంటనే చనిపోయింది. పరిచయస్థుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. నిండుతుడిని కఠినంగా శిక్షిస్తామని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

తెలిసినవాళ్ల పనేనా?
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రమ్యను హత్య చేసింది శశికృష్ణగా పోలీసులు భావిస్తున్నారు. హత్య చేయడానికి ముందు ఎనిమిది నిమిషాలు రమ్యతో నిందితుడు శశికృష్ణ మాట్లాడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడితో రమ్య వాగ్వివాదం చేసిన కొద్ది సేపటి తర్వాతే హత్య జరిగినట్టు తెలుస్తోంది. నిందితుడి ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. మరోవైపు రమ్య స్నేహితురాలు మౌనిక నుండి పోలీసులు పూర్తి వివరాలు సేకరించారు. మరోవైపు జీజీహెచ్‌లో రమ్య మృతదేహాన్ని చూసి ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. హత్యకు సంబంధించి కారణాలపై రమ్య కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించారు. రమ్యకు ఎవరి నుంచైనా వేధింపులు ఎదురవుతున్నాయా..? ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అని ఆరా తీశారు.

Advertisement

Next Story

Most Viewed