హాలీవుడ్ టాక్ షోల తీరే వేరయా!

by Shyam |
హాలీవుడ్ టాక్ షోల తీరే వేరయా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రమాణాలను సెట్ చేయాలంటే సినీనిర్మాతలు హాలీవుడ్‌ను ఆదర్శంగా తీసుకుంటారు. వారి నిర్మాణ విలువలతోపాటు వినోదం పాళ్లు కూడా కావాల్సినంతగా ఉంటాయి. అవి సినిమాలు, టీవీ షోలకు మాత్రమే పరిమితమయ్యాయనుకుంటే పొరపాటే. టాక్ షోల విషయంలోనూ హాలీవుడ్‌కు సాటి లేదు. వాటి గురించి చర్చించడానికి ముందు మన దగ్గరి టాక్ షోలు ఎలా ఉంటాయో ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. మన వద్ద టాక్ షోకు ఒక నిర్దిష్ట ఫార్మాట్ లేదు. ఒకవేళ ఉన్నా అవి ఎంటర్‌టైన్‌మెంట్, పొలిటికల్ అని రెండు రకాలుగా విడివిడిగా ఉన్నాయి. అంటే ఎంటర్‌టైన్‌మెంట్ టాక్ షో చేసేవారు రాజకీయ అంశాలు, సమాజానికి ఉపయోగపడే అంశాలను ముట్టుకోరు. ఇక పొలిటికల్ టాక్ షోల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేసే ఉద్దేశంతో నిర్మించినట్లుగా అనిపిస్తాయి. ఈ మూసధోరణిని తిరగరాస్తూ యూట్యూబ్‌లో టాక్ షోలు, ఇంటర్వ్యూలు చేస్తున్నా అవి సంబంధిత డొమైన్ వరకే పరిమితమయ్యాయి తప్ప అన్ని వర్గాల ఆడియన్స్‌ను అలరించలేకపోతున్నాయి. కానీ, హాలీవుడ్‌లో అలా కాదు. టాక్ షో అనేది ఒక బ్రాండ్. టాక్ షో నిర్వహించే వ్యాఖ్యాత ఒక ఇన్సిపిరేషన్. లారీ కింగ్ నుంచి లిల్లీ సింగ్ వరకు ఎందరో టాక్ షో వ్యాఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా తమదైన గుర్తింపును సంపాదించుకున్నారు.

ఓప్రా విన్‌ఫ్రే, ఎలెన్ డీజెనరీస్, జిమ్మీ కిమ్మెల్, జిమ్మీ ఫాలెన్, సెథ్ మేయర్స్, జేమ్స్ కార్డెన్, క్రేగ్ ఫెర్గూసన్, స్టీఫెన్ కోల్బర్ట్, గ్రాహమ్ నార్టన్, కొనన్ ఒబ్రయాన్, డేవిడ్ లెట్టర్‌మ్యాన్..ఇలా ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో టాక్‌ షోలను హోస్ట్ చేశారు. వీరిలో ప్రపంచ గమనాన్ని మార్చి, ఆదర్శంగా నిలిచిన వారు కూడా ఉన్నారు. టీవీలో మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందరికో ప్రేరణనిచ్చిన వ్యాఖ్యాతలు ఉన్నారు. 20 ఏళ్ల పాటు నిరాటంకంగా టాక్ షోను నడిపిన ఓప్రా విన్‌ఫ్రే, పాశ్చాత్య దేశాల్లో ఆఫ్రికన్, అమెరికన్ కమ్యూనిటీ సాధికారత కోసం తన కార్యక్రమం ద్వారా ఎంతో కృషి చేశారు. స్త్రీల జీవితాన్ని మెరుగుపరిచే ఎన్నో విషయాల గురించి ఆమె తన టాక్ షోలో చర్చించి, అణగారిన స్థితిలో ఉన్న స్త్రీలకు ధైర్యాన్నిచ్చారు. అలాగే ఎలెన్ డీజెనరీస్ తాను ఒక లెస్బియన్ అని ప్రకటించి, ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా ప్రపంచం నలుమూలలా ఉన్న టాలెంట్‌ను గుర్తించి, వారిని తన టాక్ షో ద్వారా పాపులర్ చేయడంలో ఎలెన్ ప్రసిద్ధురాలు. ఇక సినిమా, రాజకీయ, టెక్నికల్ రంగాలకు చెందిన సెలెబ్రిటీలను తన టాక్ షోకు ఆహ్వానించి, వారిలో ఫన్నీ కోణాన్ని, స్పెషల్ టాలెంట్‌ను ఎలెన్ బయటికి తీస్తుంది. అన్ని చోట్లా ఉన్నట్లుగానే అమెరికన్ టాక్ షోల్లో కూడా మహిళా వ్యాఖ్యాతలు తక్కువ. కానీ, యూట్యూబ్‌లో సూపర్ ఉమెన్‌గా పాపులారిటీ సంపాదించి, టాక్ షో వ్యాఖ్యాతగా మారిన లిల్లీ సింగ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె కెనడియన్ ఇండియన్, లెస్బియన్ అయ్యుండి కూడా హాలీవుడ్‌లో టాక్ షో సంపాదించడం గొప్ప విషయం.

ఓ వైపు ఇలా మహిళా వ్యాఖ్యాతలు సమాజాన్ని బాగుపరిచే ప్రయత్నంలో ఉంటే జిమ్మీ కిమ్మెల్, డేవిడ్ లెట్టర్‌మ్యాన్, స్టీఫెన్ కోల్బర్ట్ లాంటి వాళ్లు రాజకీయాలను ప్రభావితం చేసే పనిలో ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమికి వీలైనంతగా ప్రయత్నించడానికి టాక్ షో వ్యాఖ్యాతలు ఏకమై పనిచేశారు. వీరిలో జిమ్మీ కిమ్మెల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు సోషల్ మీడియాలో, ఇటు టీవీలో ఎక్కడ వీలైతే అక్కడ ట్రంప్‌ను ఏకిపారేయడానికి కిమ్మెల్ రెడీగా ఉంటారు. కేవలం అమెరికా రాజకీయాల గురించి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల రాజకీయ, సామాజిక పరిస్థితుల గురించి ఈ టాక్ షో హోస్ట్‌లు చర్చిస్తారు. ఈ టాక్ షోల్లో కేవలం సీరియస్ అంశాలే ఉంటాయనుకుంటే పొరపాటే..ఆటలు, పాటలు, డ్యాన్సులు, నవ్వులు, స్కిట్‌లు..ఇలా అన్నీ సమపాళ్లలో ఉంటాయి. ఇక పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ అందించే టాక్ షోలు కూడా ఉన్నాయనుకోండి.

జేమ్స్ కార్డెన్, జిమ్మీ ఫాలెన్, గ్రాహమ్ నార్టన్ వంటి వ్యాఖ్యాతలు నిర్వహించే టాక్ షోలు పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌తో సాగుతాయి. జిమ్మీ ఫాలెన్ టాక్ షో ముఖ్యంగా సంగీత ప్రాధాన్యంగా సాగుతుంది. పాటలను విభిన్న రకాలుగా పాడటం, పాటలతో ఆటలు, మ్యూజిక్‌లో కొత్త ప్రయోగాలు ఈయన టాక్ షోలో కోకొల్లలు. జేమ్స్ కార్డెన్ కార్యక్రమంలో ఆడే ఆటలు చూస్తే ఇలా కూడా ఆడుకోవచ్చా అనే అనుమానం రాకతప్పదు. ఇలా హాలీవుడ్ టాక్ షోలు అన్ని హంగులతో ఆకట్టుకునేలా ఉంటాయి. అలాగని మన దగ్గరి టాక్ షోలను తప్పుపట్టడం లేదు. ఎందుకంటే ఆడియన్స్‌ను బట్టే కార్యక్రమాలు ఉంటాయనేది అక్షర సత్యం. హాలీవుడ్ టాక్ షోలో బూతులు వాడతారు, ఒక వ్యక్తి గురించి తప్పుగా చెప్పాలనుకుంటే ఆధారాలతో సహా నిరూపించి, నిజాలు బయటపెట్టేస్తారు. కానీ, మన దగ్గర అలా చేస్తే ఊరుకుంటారా? ఆధారాలు వంద శాతం దోషి అని నిరూపించినా సరే..తెల్లారేసరికి ఆ టాక్ షో ప్రసారమైన టీవీ చానల్ ఆఫీస్ అద్దాలు పగిలిపోతాయి. కారణం ఏంటంటే పాశ్చాత్యుల మాదిరిగా హాస్యాన్ని హాస్యంగా, అభిప్రాయాన్ని అభిప్రాయంగా చూసే మనస్తత్వం మనకు లేదు. పైగా ప్రతి చిన్న విషయానికి మనోభావాలు దెబ్బతీసుకోవడానికి పనీపాటా లేని వాళ్లు చాలా మంది ఉంటారు. అందుకే మన వాళ్లలో సమాజం రూపురేఖలు మార్చే క్రియేటివిటీతో టాక్ షోలు నిర్వహించగల వ్యాఖ్యాతలు ఉన్నా.. రిస్క్ ఎందుకని టాలెంట్‌ను కప్పిపెడుతున్నారు. అంటే..తప్పు నిర్వాహకులది కాదు, చూసే ఆడియన్స్‌ది అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

Next Story

Most Viewed