ఏపీ ప్రజలారా జర జాగ్రత్త: ఐఎండీ

by srinivas |
ఏపీ ప్రజలారా జర జాగ్రత్త: ఐఎండీ
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జాతీయ వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఎంఫాన్ తుపాన్ తీరం దాటిన నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల 24 వరకు ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది.

ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు తారస్థాయికి చేరుకుంటాయని, వడగాడ్పుల ముప్పు తీవ్రంగా ఉందని తెలిపింది. కాగా, గుంటూరు జిల్లా రెంటచింతలలో బుధవారం ఏకంగా 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాష్ట్రంలోని పలు చోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జంగమేశ్వరపురంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది.

రానున్న మూడు రోజులు ఏపీపై సూర్యుడు ఉగ్రరూపం ప్రదర్శించనున్నాడని ఐఎండీ తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో ఆదివారం వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలని, వడగాడ్పుల నుంచి నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందొచ్చని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed