- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరో నుంచి జీరోకు చేరుకున్న ప్రముఖ క్రికెటర్.. నెక్ట్స్ ఏంటి?
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ మొత్తం గణాంకాలు తీసుకుంటే అత్యంత విజయవంతమైన విదేశీ క్రికెటర్లలలో టాప్ లిస్టులో ఉండేది డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ క్రికెటర్ ఎంత విధ్వంసకరమైన బ్యాటరో అతడి గణాంకాలు చూస్తే అర్థం అవుతాయి. ఐపీఎల్ కెరీర్‌లో 150 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 5449 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 50 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు సీజన్లు హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఒక కెప్టెన్‌గానే కాకుండా ఓపెనింగ్ బ్యాటర్‌గా ఎన్నో విజయాలు అందించాడు. ఒకప్పుడు జట్టులో డేవిడ్ వార్నర్ మాటే శాసనంగా ఉండేది. క్రికెట్ నుంచి నిషేధాన్ని ఎదుర్కొన్న సమయంలో కూడా సన్‌రైజర్స్ యాజమాన్యం అతడికి పూర్తి మద్దతు ఇచ్చింది. గత ఏడాది కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ను ప్లే ఆఫ్స్ చేర్చిన డేవిడ్ వార్నర్.. ఫ్యాన్స్ దృష్టిలో ఒక హీరోలా వెలిగిపోయాడు. జట్టులో ఎన్నో మార్పులు వచ్చినా గత ఆరు సీజన్లుగా ఎదురు లేని కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ కొనసాగాడు. కానీ, ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఫామ్ లేమితో వార్నర్..
క్రికెట్‌లో ఏ ఆటగాడికైనా ఏదో ఒక దశలో ఫామ్ లేమితో ఇబ్బంది పడటం చూస్తూనే ఉంటాం. సచిన్ టెండుల్కర్ అంతటి క్రికెటరే సరైన పరుగులు చేయలేక.. కెప్టెన్‌గా విజయాలు సాధించలేక మానసిక క్షోభను అనుభవించాడు. కానీ, అప్పుడు టీమ్ ఇండియా యాజమాన్యం అతడికి అండగా నిలబడింది. డేవిడ్ వార్నర్ కూడా ప్రతీ సీజన్‌లో పరుగుల వరద పారించాడు. కానీ, ఈ సీజన్‌లో పరుగులు చేయలేక డీలాపడ్డాడు. మరోవైపు కెప్టెన్‌గా కూడా మ్యాచ్‌లు గెలిపించలేక పోయాడు. ఇలా రెండు విధాలుగా విఫలం కావడంతో అతడిపై ఒత్తిడి పడింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా బ్యాటుతో పెద్దగా రాణించడం లేదు. కానీ, జట్టు వరుసగా విజయాలు సాధిస్తుండంతో అతడి ఫామ్ లేమి పెద్దగా చర్చనీయాంశం కావడం లేదు. కానీ, డేవిడ్ వార్నర్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. పరుగులు చేయడం లేదనే ఉద్దేశంతో మొదట వార్నరే తప్పుకొని డకౌట్‌లో కూర్చున్నాడు. కానీ, ఆ తర్వాత మాత్రం యాజమాన్యం అతడిని బలవంతంగా బయటే ఉంచేసింది. తొలి దశ నుంచి రెండో దశకు మధ్యలో ఏం జరిగిందో అనేది ఖచ్చితంగా తెలియకపోయినా.. వార్నర్, ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం మధ్య మాత్రం అగాధం పెరిగినట్లు సన్నిహితులు చెబుతున్నారు.
జట్టు కూర్పులో జోక్యమే కారణమా?
డేవిడ్ వార్నర్, యాజమాన్యానికి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తున్నది. జట్టుకు విజయాలు అందించలేక పోవడంతో జట్టు కూర్పులో యాజమాన్యం తలదూర్చినట్లు సమాచారం. తుది జట్టు నుంచి మనీశ్ పాండేను తొలగించి వేరే క్రికెటర్‌కు అవకాశం ఇవ్వాలని బలవంత పెట్టడంతో డేవిడ్ వార్నర్ నొచ్చుకున్నాడని.. ఆ విషయంలో పెద్ద రాద్దాంతమే జరిగిందని ఫ్రాంచైజీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జట్టుకు టైటిల్ తెచ్చిపెట్టడమే కాకుండా ఎన్నో విజయాలు అందించిన తన మాటను లెక్క చేయకపోవడం వార్నర్‌ను ఇబ్బంది పెట్టింది. దీంతో వార్నర్‌కు తుది జట్టులో కూడా స్థానం లేకుండా పోయింది. మరోవైపు తరచుగా సోషల్ మీడియా వేదికగా తాను జట్టుకు దూరమవుతున్న సంకేతాలు ఇవ్వడం ఫ్రాంచైజీ యాజమాన్యానికి నచ్చలేదు. వార్నర్ వ్యవహారం జట్టు గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందని భావించింది. ఇలా రోజురోజుకూ అగాధం పెరిగిపోవడంతో కనీసం తుది 18 మందిలో కూడా వార్నర్ పేరును చేర్చడం లేదు. దీంతో మ్యాచ్‌లు జరుగుతున్నా.. వార్నర్ హోటల్ గదికి పరిమితం కావడమో లేదా గ్యాలరీల్లో కూర్చోవడమో చేస్తున్నాడు. వార్నర్‌కు తీవ్ర అవమానాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నా.. అతడు మాత్రం కొన్నిరోజులు మౌనంగా భరిస్తే సరిపోతుంది కదా అనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఏదేమైనా ఒక్కప్పుడు హైదరాబాద్ జట్టు హీరోగా ఉన్న వార్నర్.. ప్రస్తుతం జీరోలా మారిపోయాడని ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
నెక్ట్స్ ఏంటి?
డేవిడ్ వార్నర్ ఈ సీజన్ తర్వాత హైదరాబాద్ జట్టును వీడటం దాదాపు ఖాయమే. అతడు వచ్చే సీజన్‌లో కొత్త జట్టుకు ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లక్నో కేంద్రంగా సంజీవ్ గోయంకా గ్రూప్ కనుక బిడ్ గెలిస్తే వార్నర్‌ను కెప్టెన్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడు. అతడి స్థానంలో వార్నర్‌ను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫామ్‌లో లేకపోవడం అనేది ఒక దశ మాత్రమే అని వచ్చే సీజన్‌లో సరికొత్త వార్నర్‌ను చూసే అవకాశం కలుగుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.