ఖమ్మం జిల్లాలో… కుండపోత

by Sridhar Babu |
ఖమ్మం జిల్లాలో… కుండపోత
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురుస్తోంది. గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 84.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జిల్లా చరిత్రలో తొలిసారిగా సత్తుపల్లి మండలంలో 186.8 మి. మీ వ‌ర్షం ప‌డ‌టం గ‌మ‌నార్హం. అత్య‌ల్పంగా తిరుమ‌లాయ‌పాలెంలో 45.2మి.మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఖ‌మ్మం జిల్లాలో ఖమ్మం ప‌ట్ట‌ణంతో పాటు , ఖమ్మం రూర‌ల్‌, చింతకాని, రఘునాథపాలెం, కుసుమంచి, స‌త్తుప‌ల్లి, మ‌ధిర‌ మండలాల్లో భారీవ‌ర్షం కురిసింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంప‌హాడ్‌, ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో పంట‌పొలాలు నీట‌మునిగాయి.

వాగులు వంక‌లు పొంగి పొర్లుతుండ‌టంతో చాలా గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పెంకిటిల్లు నాని కూలిపోవడంతో 15 మేకలు మృతి చెందాయి. తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో రాత్రినుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాథమిక పాఠశాల గొడ కూలిపోవడంతో పాఠశాలలోకి నీరు చేరింది. దీంతో పంపిణీ చేయ‌డానికి సిద్ధంగా ఉంచిన బతుకమ్మ చీరలు, రేషన్ బియ్యం, పంచదార, కందిపప్పు, నీట మునిగిపోయాయి. ఖ‌మ్మం ప‌ట్ట‌ణానికి ఆనుకుని ఉన్న‌ మున్నేరు వాగు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది.

మున్నేరు స‌మీపంలోని ప‌లు కాల‌నీలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. ఖమ్మంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ఖానాపురం చెరువుకు ఎగువ నుంచి పాండురంగ పురం, బల్లేపల్లి మీదుగా భారీగా వరద నీరు వస్తోంది.. వాగులో, చెరువులో కబ్జాల కారణంగా వరద ప్రవహించే పరిస్థితి లేక పాండురంగాపురంలో వరదనీరు ఇళ్లలోకి చేరుతోంది. ఇల్లందు రోడ్డుపై ఇండస్ట్రీయల్ ఏరియా వద్ద భారీగా వరద నీరు చేరింది.. చెరువు శిఖం భూముల్లో లోతట్టు ప్రాంతంగా ఉన్న జయనగర్ కాలనీ, ఖానాపురం అలుగు వెంబడి ఇరువైపుల ఉన్న అమరావతి నగర్, కీర్తినగర్ ప్రాంతాలలో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. వైరాలో రూ.ల‌క్ష విలువ చేసే గొర్రెలు మృత్యువాత‌ప‌డ్డాయి. అలాగే బోన‌క‌ల్ ప‌ట్ట‌ణ‌ లోత‌ట్టు ప్రాంతాల్లోని ఇళ్ల‌లోకి వ‌ర‌ద నీరు చేర‌డంతో జ‌నాలు అవ‌స్థ‌లు ప‌డ్డారు. స‌త్తుప‌ల్లి ప‌ట్ట‌ణంలో చాలా కాల‌నీలు నీట మునిగాయి. ప‌ట్ట‌ణంలోని ప్ర‌ధాన ర‌హ‌దారులు కూడా జ‌ల‌సంద్రంగా మారాయి. భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలోని కిన్నెర‌సాని ప్రాజెక్టు నిండుకుండ‌లా మారింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కింద‌కు వ‌దిలేందుకు అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు. గోదావ‌రికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అధికారులు ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఆటంకం..

తీవ్ర‌మైన ఈదురుగాలుల‌తో వాన క‌రుస్తుండ‌టంతో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర ఆటంకం ఏర్ప‌డుతోంది. విద్యుత్‌శాఖ అనేక చోట్ల స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తోంది. ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ప్రవహించే వాగులు దాటొద్దని, పశువుల ను కూడా మేతకు వడలొద్దని, మత్స్యకారులు చేపలు వేటకు వెళ్ళొద్దని, రిజర్వాయర్లు పూర్తిగా నిండి ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఖ‌మ్మం క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్‌, భ‌ద్రాద్రి క‌లెక్ట‌ర్ ఎంవీరెడ్డి హెచ్చ‌రించారు.

అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ లకు ఫోన్ చేయాలని సూచించారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం క‌లెక్ట‌రేట్‌లో ప్ర‌త్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అలాగే మండ‌ల త‌హ‌సీల్దార్ కార్యాల‌యాల్లో కంట్రోల్ రూంల‌ను ఏర్పాటు చేశారు. గోదావ‌రి ఉధృతిని అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. వాస్త‌వానికి గ‌త వారం రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో ప‌త్తి పంట బాగా దెబ్బ‌తింది. ప‌త్తికాయ‌ల్లోకి నీరు చేరి బుడ్డిపోతోంద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే పూసిన ప‌త్తిలోకి నీరు చేర‌డంతో మొల‌క‌లు వ‌స్తున్నాయి. దిక్కుమాలిన వాన ఎందుకు ప‌డుతోంద‌ని, పంట‌ల‌ను నాశ‌నం చేసేందుకే వ‌చ్చిందంటూ రైతులు తిట్టిపోస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed