చెరువును తలపిస్తున్న… విద్యుత్ కేంద్రం

by Shyam |   ( Updated:2020-09-26 03:53:59.0  )
చెరువును తలపిస్తున్న… విద్యుత్ కేంద్రం
X

దిశ,సిద్దిపేట: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ వర్షాకాలంలో అధిక వర్షపాతం నమోదు కావడంతో పలు ఇండ్లు కూలిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో రైతాంగానికి తీవ్ర నిరాశకు గురిచేసింది. అధిక వర్షపాతం వల్ల సిద్దిపేట అర్బన్ మండలంలోని పొన్నాల గ్రామ శివారులో గల విద్యుత్ కేంద్రంలోకి వరద నీరు వచ్చి చేరడంతో విద్యుత్ కేంద్రం చెరువును తలపిస్తుంది.

దీంతో విద్యుత్ కేంద్రంలోకి వెళ్లి విధులు నిర్వహించేందుకు ఆపరేటర్లు భయంతో జంకుతున్నారు. విద్యుత్ కేంద్రంలోని ట్రాన్స్ ఫార్మర్ లోకి నీళ్లు చేరడంతో ఆపరేటర్లు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రాజీవ్ రహదారికి విద్యుత్ కేంద్రం ప్రక్కనే ఉండడంతో రహదారి వెంట వెళ్లే ప్రయాణికులు వచ్చిన వరద నీటిని చూసి ఇది చెరువా లేక విద్యుత్ కేంద్రమా అని ఆశ్చర్యపోతున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ కేంద్రంలో నిలిచిన నిలువ నీటిని బయటకు తరలిస్తే గానీ ఆపరేటర్లు విధులు నిర్వహించే పరిస్థితి కనబడడం లేదు.

Advertisement

Next Story

Most Viewed