- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎక్కడ చూసినా.. జలమయం
దిశ, న్యూస్ బ్యూరో : వానలు విలయం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. అదే సమయంలో లెక్కకు మించి కురుస్తున్న వాన జనావాసాలను ముంచివేసింది. రహదారులపై నుంచీ వరద ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. జనజీవనం అతలాకుతలం అవుతోంది. రాకపోకలకు విఘాతం కలుగుతోంది. పంట పొలాల నిండా నీరు చేరుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రమంతా జల విలయం తాండవిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు నీటి వనరులన్నీ జలకళను సంతరించుకున్నాయి. గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. తీర ప్రాంతాలలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వానల కారణంగా పలు ప్రాంతాలు నీటి లో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల ఇండ్లన్నీ ముగినిపోయాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కకావికలమైంది. వరంగల్ నగరం నీట మునిగింది. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అం చనా వేస్తున్నారు. ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
దండిగా వానలు
ఇప్పటికే అల్పపీడనం ప్రభావం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత పదేళ్లలో వానాకాలంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయి. కొద్ది గంటల్లోనే రాష్ట్రంలో సగటు 27.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఈదులగట్టుపల్లిలో 27.4, వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 27 సెంటీమీటర్ల వర్షపాతం పదేళ్ల తర్వాత రికార్డుస్థాయిలో వర్ష పాతం నమోదైంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలతాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. హన్మకొండ, వరంగల్, కాజీపేటలోని పలు కాలనీలు నీటమునిగాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గోదావరి తీరంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హై అలర్ట్ ప్రకటించారు. పరీవాహక ప్రాంత ప్రజలను రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందా లను రంగంలోకి దింపారు. లోతట్టు ప్రాంతాలవాని పునరావాస కేంద్రాలకు తరలించారు.
జంపన్న వాగు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రవహిస్తోంది. మేడారం, పస్రా దారిలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అడవిలో ఉన్న కొండాయి, మల్యాల, ఐలాపూర్ గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. మహమూబాబాద్, ములుగు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లా చెర్ల మండలం తాలిపేరు జలాశయం వరద పోటెత్తుతున్నది. 23 గేట్లను ఎత్తి 1.25లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతు న్నారు. కిన్నెరసాని ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల నీరు రావడంతో 12 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. పాలేరు రిజర్వాయర్ మత్తడి దుంకుతోంది. నాగార్జునసాగర్ ఎడమకాలువ నుంచి రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. మూడేళ్ల తర్వాత మున్నేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలారోజుల తర్వాత మానేరు నది ప్రవహిస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఎగువ మానేరుకు వరద వచ్చి చేరుతోంది.
27 సెంటీమీటర్ల వాన
కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ములుగు జిల్లా వెంకటాపూరంలో 22.4 సెంటీమీటర్లు, మంగపేట మండలంలో 21.3 సెంటీమీటర్ల వాన కురిసింది. వాజేడులో 19.3 సెంటీమీటర్లు, కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదులగట్టెపల్లిలో 16.8, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 16.2 సెంటీమీటర్లు వర్షం కురిసింది. వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 15 నుంచి 11 సెంటీమీటర్ల సగటు వర్షం కురిసింది. 12 జిల్లాలోల గత పదేండ్లలో లేని విధంగా భారీ అత్యధిక వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూ డెంలో 1012 మి.మీ, వరంగల్ రూరల్ లో, 971 మి.మీ, వరంగల్ అర్బన్ లో 1003 మి.మీ, కరీంనగర్లో 817 మి.మీ, సిద్దిపేటలో 781 మి.మీ, జనగామలో 758 మి.మీ, మహబూబ్‌నగర్లో 628 మి.మీ, జోగుళాంబ గద్వాలలో 553 మి.మీ, వనపర్తిలో 675 మి.మీ, నాగర్ కర్నూల్లో 475 మి.మీ, ములుగులో 1263 మి.మీ, నారాయణపేటలో 585 మి.మీ. వర్షం కురిసింది.
జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. నిర్మల్ మినహా మిగిలిన జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రం మొత్తంగా సాధారణ వర్షపాతం 493.6 మి.మీ ఉండగా 674.8 మి.మీగా నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 2004 తర్వాత ఇప్పుడే ఈ స్థాయిలో వర్షం కురిసినట్లు ప్రకటించారు. 2006 ఏడాది తర్వాత అత్యధిక వర్షపాతం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, కరీంనగర్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ములుగు ప్రాంతాల్లో ఇప్పుడు కురిసింది. 2005 తర్వాత కూడా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండలోని పలు ప్రాంతాల్లో ఈసారి అత్యధికంగా వర్షం కురిసింది.
ఉగ్ర గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం ఆదివారం సాయంత్రం 53 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అర్థరాత్రి వరకు ప్రమాదస్థాయి దాటే అవకాశాలున్నట్లు కేంద్ర జలసంఘం ప్రకటించింది. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూంను ఏర్పాటుచేశారు. 2014 తర్వాత మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 2014లో సెప్టెంబర్లో 56.1 అడుగులు, 2015 జూన్ 22న 51 అడుగులు, 2016 జూలై 12న 52.4, 2017 జూలై 20న 36.7, 2018 ఆగస్టు 22న 50 అడుగులు, 2019 ఆగస్టు 9న 51.2 అడుగుల మేరకు ప్రవహించిందని, ఇప్పుడు 53 అడుగుల్లో ప్రవహిస్తూ 1986 నాటి ఇదే రోజు రికార్డును దాటుతుందని కేంద్ర జల సంఘం అంచనా వేస్తోంది. గోదావరి నది ఉగ్రరూపంతో ములుగు జిల్లాలో పరిస్థితులు కొంత ఇబ్బంది కరంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
గోదావరి ఆఖరు ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరిందని మంత్రి దయాకర్‌రావు వెల్లడించారు. కొన్ని గ్రామాలకు కనెక్టివిటీ పోయిందని, కన్నాయిగూడెం మండలం కంతనపల్లి, ఏటూరు నాగారం చుట్టుపక్కల రామన్నగూడెం వంటి పల్లెలు, మంగపేట మండలం కట్టిగూడెం, దేవనగర్ వాడగూడెం, పొదుమూరు వంటి గ్రామాల ప్రజలను ఆదుకోవడానికి అన్నిఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ధవళేశ్వరం దగ్గర గోదావరి రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ దగ్గర నీటిమట్టం 14.9 అడుగులకు చేరింది. సముద్రంలోకి 14.14 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టులో దాదాపు 36 గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.
భద్రాద్రి జిల్లా ఇల్లెందు సమీపంలోని కిన్నెరసాని, మల్లన్నవాగు, జిల్లేరు, ఏడు మెలికల వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్లలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు భారీగా వరద చేరుతోంది. మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 5 గేట్లు రెండున్నర ఫీట్లు ఎత్తి 16,125 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 645 అడుగులు, ప్రస్తుతం 643.8 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ 4.46 టీఎంసీలు, 4.067 టీఎంసీలున్నాయని అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లో 13,400 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 16,270 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ కాలువలకు 100 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
వరంగల్‌కు డీఆర్ఎఫ్ బృందాలు
భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వరంగల్‌లో సహాయ కార్యక్రమాలను నిర్వహించడానికి జీహెచ్‌ఎంసీకి చెందిన మూడు డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్లాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బృందాలను పంపినట్టు వీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. మూడు డీఆర్‌ఎఫ్ వాహనాలు, ఒక బోటు, ఇతర సాధన సామగ్రితో 40 మంది సిబ్బంది హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.