- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్ వార్‌లో త్రిముఖ పోరు
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ మారాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను మించి రసవత్తరంగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం నువ్వా, నేనా అన్న విధంగా మారింది. టీఆర్ఎస్, ఎంఐఎం ఒకే గూటి పక్షులంటూ బీజేపీ చీల్చి చెండాడుతుండగా, ఆ రెండు పార్టీలు వేటికవే బీజేపీపై విరుచుకుపడుతున్నాయి. మొత్తంగా ప్రచారం ముగింపు దశకు చేరింది. చివరి అంకంలో మరింత ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆయా స్థాయి నాయకులు ప్రచారం చేయగా, ఈరోజు మరో ముఖ్య సన్నివేశం చోటు చేసుకోనుంది. ముగ్గురు అతి ముఖ్యమైన పర్సనాలిటీలు హైదరాబాద్‌లో ఆయా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాలతో సంబంధం లేని ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తుండగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాతబస్తీలోని శాలిబండలో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొననున్నారు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఇప్పటిదాకా జరిగిన ఉద్రేకం రేకెత్తించే ప్రసంగాలకు ఇప్పుడు బీజేపీ తరఫున యోగి ఆదిత్యనాథ్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని చేసే ప్రసంగం కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించినదైనా, పరోక్షంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేలా సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
యోగి హై వోల్టేజ్ స్పీచ్..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పటిదాకా మజ్లిస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఉప్పు-నిప్పు వాతావరణమే నెలకొంది. హిందూ-ముస్లిం విషయంలో మజ్లిస్, బీజేపీ నేతల మధ్య ఢీ అంటే ఢీ అనే తీరులోనే మాటల మంటలు రేగాయి. పాతబస్తీ కేంద్రంగా మజ్లిస్ ప్రచారం చేసుకుంటోంది. ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నా పాతబస్తీ ముచ్చట్లనే ప్రస్తావిస్తూ బీజేపీ మతాన్ని తెరపైకి తెచ్చింది. ఇదంత సద్దుమణగకముందే యోగి ఆదిత్యనాథ్‌తో పాతబస్తీలోనే బహిరంగసభను ఏర్పాటు చేయడంతో ఆ పార్టీల మధ్య ఇంకెంత హీట్ పెరుగుతుందోననే చర్చలు మొదలయ్యాయి. ఈ రెండు పార్టీల మాటలతో ఓటర్లు హిందూ, ముస్లిం మతాల ప్రాతిపదికన ఇప్పటికే ఎటువైపు నిలబడాలో తేల్చేసుకున్నారని, ఇప్పుడు యోగి ఎలాంటి కామెంట్లు చేస్తారో, ఎంతటి ఉద్రిక్తత చోటు చేసుకుంటుందోననే చర్చలు మొదలయ్యాయి.
టీఆర్ఎస్ క్యాంపెయిన్‌కు ఫినిషింగ్ టచ్..
గ్రేటర్ ఎన్నికల్లో ప్రతీ డివిజన్‌కు ఒక ఎమ్మెల్యేను ఇన్‌చార్జిగా, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రిని ఇన్‌చార్జిగా నియమించిన టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎన్నికలకు మంత్రి కేటీఆర్‌ను బాధ్యుడిగా నియమించింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా అన్నీ తానై కీలక భూమిక పోషించిన కేటీఆర్ రోడ్‌షోల ద్వారా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. మరోవైపు వివిధ కుల, వృత్తి, వ్యాపార-వాణిజ్య సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సమావేశమయ్యారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు గల్లీల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. వారం రోజుల పాటు జోరుగా సాగిన ప్రచారం తర్వాత మొత్తం గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. బీజేపీ నేతలు మతాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా ఎన్నికల ప్రచారం చేసి ప్రజల్లో భావోద్వేగాలను రేకెత్తించగా ఇప్పుడు ఆ పార్టీ కామెంట్లకు సీఎం కేసీఆర్ ఘాటుగానే తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేయనున్నారని ఆ పార్టీ నేతలే ధీమాగా చెప్తున్నారు. ఇప్పటివరకూ ఉన్న వాతావరణానికి యోగి, సీఎం కేసీఆర్‌ల ముగింపు ఉపన్యాసాలు, ప్రచారం చివరి రోజైన ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసే కామెంట్లు ఎన్నికల సరళిలో గణనీయమైన మార్పునే తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికలు కేవలం హైదరాబాద్ నగరానికి సంబంధించినవే అయినా ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ అగ్రనేతలు, ఛోటా నాయకులు కూడా ఇంత భారీ స్థాయిలో ప్రచారం చేయడం ఇదే తొలిసారి. టీఆర్ఎస్ కూడా తన మొత్తం సైన్యాన్ని (మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు…) మోహరించడం ఇదే మొదటిసారి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ కనిపించనంతటి వేడి ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిబింబిస్తోంది.