మాకు రూ. 2,925 కోట్ల లాభమొచ్చింది

by Shyam |   ( Updated:2020-07-17 03:22:26.0  )
మాకు రూ. 2,925 కోట్ల లాభమొచ్చింది
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం 31.70 శాతం పెరిగి రూ. 2,925 కోట్లుగా ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 2,220 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం 8.6 శాతం పెరిగి రూ. 17,841 కోట్లను చేరుకుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. వాటాదారులకు షేర్‌కు రూ. 2 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. నిర్వహణ మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 19.5-20.5 శాతం మధ్య పెరిగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. కాగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రతి త్రైమాసికానికి ఆదాయ పెరుగుదలను నమోదు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. సగటున 1.5 శాతం నుంచి 2.5 శాతం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. రాబోయే మూడు త్రైమాసికాల వరకు ఇదే స్థిరత్వాన్ని కొనసాగించగలమని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. ఇక, 2020-జూన్ చివరి నాటికి హెచ్‌సీఎల్ సంస్థలో మొత్తం 1,50,287 మంది ఉద్యోగులు ఉన్నారని, మరో 7 వేల మంది ఉద్యోగులు కొత్తగా చేరారని తెలిపింది.

Advertisement

Next Story