రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో: గుత్తా సుఖేందర్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-12-17 02:43:31.0  )
రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో: గుత్తా సుఖేందర్ రెడ్డి
X

దిశ, నల్లగొండ: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేలవిడిచి సాము చేస్తున్నారని,‌ సీఎం కేసీఆర్ పై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తూ నోరు పారేసుకోవద్దని మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని గుత్తా క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన 12 ఎమ్మెల్సీ స్థానాల కోసం నిర్వహించిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించిందని అన్నారు. సీఎం కేసీఆర్ పై ప్రజల్లో, ప్రజాప్రతినిధుల్లో ఉన్న విశ్వాసం, నమ్మకం మరోసారి రుజువైందని కొనియాడారు.

నల్లగొండలో ఎంసీ కోటిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే నవ్వు వస్తోందని ఎద్దేవా చేశారు. ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారని, దిగజారి రాజకీయాలు చేస్తున్న రేవంత్ ను ప్రజలు బహిష్కరించే రోజు త్వరలోనే వస్తుందని చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ.. అడ్డగోలుగా, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్న రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి రాష్ట్రాన్ని సాధించి, బంగారు తెలంగాణగా మారుస్తున్న మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని, ఆయనపై ఇష్టారీతిన మాట్లాడడం తగదని అన్నారు.

కేంద్రం చేతులెత్తేయడంతో తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. బ్యాంక్ లను, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అన్ని సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. 16 లక్షల కోట్ల లాభాల్లో ఉన్న బ్యాంక్ లను అమ్మడం బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. దుర్మార్గపు విధానాలతో బీజేపీ దేశాన్ని అంబానీ లకు, ఆదానీలకు అమ్ముతున్నదని ఆరోపించారు. పబ్లిక్ రంగ సంస్థలను అమ్మే విధానాలను బీజేపీ ప్రభుత్వం విడనాడాలని పేర్కొన్నారు. ప్రజలపై భారం వేస్తూ పేదరికాన్ని పెంచుతున్న కేంద్రం తీరు బాధాకరమని అన్నారు. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు యామా దయాకర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed