గుంటూరులో 41 కేసులు.. పూర్తి లాక్‌డౌన్

by srinivas |
గుంటూరులో 41 కేసులు.. పూర్తి లాక్‌డౌన్
X

ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ రాజధానికి కూతవేటు దూరలోని గుంటూరు జిల్లాపై కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకీ కొత్త కేసులు నమోదై నగరవాసులను ఆందోళనలో ముంచుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చారు. నేటి నుంచి గుంటూరులో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు కానుంది.

గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ గత 21 రోజుల్లోనే నమోదు కావడం విశేషం. గుంటూరులోని వన్ టౌన్ ప్రాంతంలోనే తొలుత కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కొరిటిపాడు, విద్యానగర్, శ్రీనివాసరావుపేటలకు కూడా కరోనా కేసులు విస్తరించాయి. ఈ పరిణామమే రాష్ట్ర, జిల్లా వైద్యాధికారుల్లో ఆందోళన పెంచుతోంది. దీంతో మున్సిపల్, పోలీసు శాఖలు రంగంలోకి దిగాయి.

నేటి వరకు నిత్యవసర వస్తువుల కొనుగోలుకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. నేటి నుంచి గుంటూరు జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే ఈ వెసులు బాటు ఉంటుంది. కేవలం 3 గంటల వ్యవధిలోనే నిత్యావసరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు.

కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 8 నమోదయ్యాయని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రకటించారు. జిల్లాలో 41 కేసుల్లో 27 కేసులు గుంటూరులోనే నమోదైనట్టు ఆయన వెల్లడించారు. దీంతో గుంటూరులోని మంగళదాస్ నగర్, కుమ్మరి బజార్, ఆనందపేట, బుచ్చయ్యతోట, నల్లచెరువు, సంగడిగుంట, శ్రీనివాసరావుతోట, ఆటోనగర్, ఎల్బీనగర్, కొరిటపాడు ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించామని ప్రకటించారు. రెడ్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరించారు.

ఢిల్లీ వెళ్లొచ్చిన వారిని కలిసిన వారు, ‘కరోనా’ లక్షణాలు ఉన్న వారు పరీక్షల నిమిత్తం ముందుకు రావాలని సూచించారు. ఆర్ఎంపీ వైద్యులు తమ క్లినిక్ లను మూసివేయాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమానితులు వస్తే నోటిఫై చేయాలని చెప్పారు. నిత్యావసరాల కొనుగోలు చేసే సమయాన్ని ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కుదించామని తెలిపారు.

Tags: guntur district, guntur city, corona virus, red zones, restrictions, lockdown

Advertisement

Next Story

Most Viewed