టెన్షన్ టెన్షన్ : బైంసాలో 15 నిమిషాలు తొక్కిసలాట.. మంత్రి, అధికారులు ఎక్కడంటూ..!

by Anukaran |   ( Updated:2023-03-28 17:05:11.0  )
bainsa
X

దిశ, ముధోల్ : గత రెండ్రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పళ్సీకర్ రంగారావు ప్రాజెక్టు పూర్తిగా నీటితో నిండుకుంది.ఈ క్రమంలోనే ప్రాజెక్టు బ్యాక్ వాటర్ గుండెగాం గ్రామాన్ని చుట్టుముట్టగా గ్రామ ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కనుచూపు మేర ఎటుచూసినా నీళ్లే దర్శనమిస్తున్నాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో వస్తువులు మొత్తం తడిచిపోయాయి. ఈ విషయంపై గతంలోనూ ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు విన్నవించగా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా తాజా వర్షాలతో మరోసారి గుండెగాం నీటిలో మునిగిపోయింది.

దీంతో ఆగ్రహించిన ముంపు బాధితులు శుక్రవారం బైంసా పట్టణంలోని నిర్మల్ చౌరస్తాలో జిల్లా భాజపా జిల్లా అధ్యక్షురాలు పడకండి రమాదేవి, భాజపా నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు.పోలీసులు ఎంతగా సముదాయించినా తమకు న్యాయం కావాలంటూ కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రి ఇక్కడికి రావాలంటూ వారు ఆందోళనలు చేశారు. వర్షాలు కురిసిన ప్రతీసారి తమ గ్రామం నీట మునుగుతున్నా శాశ్వత పరిష్కారం ఎందుకు చూపించడం లేదంటూ నడిరోడ్డుపై బైఠాయించారు. చివరగా నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు వచ్చి బాధిత గ్రామస్తులకు నచ్చచెప్పారు.

అయినా వారు వినకపోవడంతో రాస్తారోకో చేస్తున్న వారిని పోలీసు బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో గ్రామస్తులు, భాజపా కార్యకర్తలు, జిల్లా భాజపా అధ్యక్షులు రమాదేవిని సైతం అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కాగా, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు నిరసన విరమించేందుకు నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా ఆమెను వ్యాన్ ఎక్కించారు. ఈ క్రమంలో దాదాపు 15 నిముషాలు తొక్కిసలాట చోటుచేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed