మరోసారి రూ. లక్షకోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

by Harish |   ( Updated:2021-08-01 05:32:22.0  )
మరోసారి రూ. లక్షకోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది జులై నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు పుంజుకున్నాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు తెరుచుకుంటున్న క్రమంలో వినియోగం మెరుగ్గా ఉండటంతో వసూళ్లు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమీక్షించిన నెలలో జీఎస్టీ వసూళ్లు మొత్తం రూ. 1.16 లక్షల కోట్లకు చేరుకున్నాయని మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. గతేడాది జూలై నెలలో నమోదైన రూ. 87,422 కోట్ల కంటే ఈసారి 33 శాతం అధికంగా వసూలయ్యాయి. జూన్‌లో వచ్చిన రూ. 92,894 కోట్ల కంటే 25 శాతం అధికం. అంతకుముందు వరుసగా ఎనిమిది నెలలు రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు జరగ్గా, జూన్‌లో రూ. లక్ష కోట్లకు దిగువకు తగ్గాయి. అయితే, జూలైలో మెరుగైన కార్యకలాపాల నేపథ్యంలో వసూళ్లు తిరిగి పుంజుకున్నాయి.

“జూలై నెలలో మొత్తం రూ. 1,16,393 కోట్లు రాగా, ఇందులో సీజీఎస్టీ రూ. 22,197 కొట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 28,541 కోట్లు, ఐజీఎస్టీ రూ. 57,864 కోట్లు(వస్తువుల దిగుమతిపై వచ్చిన రూ. 27,900 కోట్లు సహా), సెస్ రూ. 7,790 కోట్లు(వస్తువుల దిగుమతిపై రూ. 815 కోట్లు సహా) వసూలయ్యాయని” మంత్రిత్వ శాఖ తెలిపింది. “ఈ వసూళ్లు కరోనా సెకెండ్ వేవ్ మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక కార్యకలాపాల్లో పునరుద్ధరణను సూచిస్తున్నాయి. కొవిడ్ ఆంక్షలను సడలించడంతో జులైలో తిరిగి రూ. లక్ష కోట్లు దాటాయి. రానున్న నెలల్లో మరింత బలమైన జీఎస్టీ ఆదాయం నమోదయ్యే అవకాశం ఉందని” నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story