తెలంగాణ సోనా ప్రోత్సహించాలి: గవర్నర్ తమిళి సై

by Shyam |
తెలంగాణ సోనా ప్రోత్సహించాలి: గవర్నర్ తమిళి సై
X

దిశ, న్యూస్​బ్యూరో: రోగ నిరోధక శక్తిని అభివృద్ది చేసే వంగడాలను పరిశోధనలు చేయాలని వ్యవసాయరంగ పరిశోధకులకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో రాజ్‌భవన్​ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేసిన తెలంగాణ సోనా ప్రోత్సహించడం ద్వారా యువతకు కూడా అన్నానికి దగ్గర చేయవచ్చని ఆ రకంగా మన దక్షిణ భారతదేశ సంప్రదాయాన్ని కాపాడుకోవచ్చని గవర్నర్​ అన్నారు. తాటి చెట్టును తరతరాలుగా మన పూర్వీకులు ఒక కల్పవృక్షంగా భావిస్తున్నారని, ఆ చెట్టు ప్రతి భాగం కూడా ఎన్నోరకాలుగా ఉపయోగ పడుతుందని వివరించారు. ఇప్పుడు ఆ చెట్లను కాపాడుకోవడంతో పాటు మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ సూచించారు. నీరా పానీయం ఎంతో పోషకాహార విలువలు కలిగి ఉందని ఈ పానీయాన్ని ఎక్కువకాలం పోషక విలువలు పోకుండా నిలువ ఉంచే విధంగా పరిశోధనలు జరగాలన్నారు. తాటి చెట్టు ద్వారా వివిధ ఉత్పత్తులను తయారు చేసే కుటీర పరిశ్రమలు తమిళనాడు, కేరళలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, తాటిచెట్టు తమిళనాడు రాష్ట్ర అధికారిక చెట్టు అని గవర్నర్‌ తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్‌ సెక్రటరీ సురేంద్రమోహన్‌, జాయింట్‌ సెక్రటరీ సీఎస్‌ రఘు ప్రసాద్‌, అనుసంధాన అధికారి సిహెచ్‌ సీతారాములు, డా. కె. రాజారామ్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Next Story