సర్కారు నిర్లక్ష్యం.. సెర్ప్ సొమ్ముతో బ్యాంకుల జల్సా

by Shyam |   ( Updated:2021-06-19 10:20:00.0  )
SERP
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెర్ప్ సొమ్ముతో బ్యాంకులు జల్సా చేస్తున్నాయి. వాటిని వసూలు చేసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఏడేండ్ల నుంచి బ్యాంకుల నుంచి తీసుకోవడంలో అడుగులేయడం లేదు. సెర్ప్ సిబ్బంది వేతనాలు పెంచేందుకు, వేతనాలు సకాలంలో ఇచ్చేందుకు నానా తంటాలు పడుతున్న గ్రామీణాభివృద్ధి శాఖ బ్యాంకుల నుంచి సేవా రుసుంను రాబట్టుకోలేకపోతోంది. ప్రస్తుతం సెర్ప్ సిబ్బంది వేతనాల పెంపు అంశంలో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.

రాష్ట్రంలోని మహిళా సంఘాల్లోని మహిళలకు వేల కోట్ల రుణం ఇప్పిస్తున్న సెర్ప్‌కు బ్యాంకుల నుంచి 3.5 శాతం సర్వీస్​ట్యాక్స్ రావాల్సి ఉంటుంది. దీన్ని ప్రభుత్వం అధికారంగా జీవో రూపంలో విడుదల చేసింది. జీవో నెంబర్ 294 ద్వారా 2013 జూలై 10న ఈ జీవో ఇచ్చింది. మరో జీవో 322 ద్వారా దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఎస్‌జీలకు రుణాలు ఇప్పించే క్రమంలో సూక్ష్మ రుణ ప్రణాళిక తయారు చేయడం, డాక్యుమెంటేషన్, లోన్​తర్వాత రికవరీ వంటి పనులన్నీ సెర్ప్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. దీనికి బ్యాంకుల నుంచి సేవా రుసుంను చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇచ్చిన అప్పుకు 12 శాతం వడ్డీని వసూలు చేస్తున్న బ్యాంకులు.. సర్వీస్ ట్యాక్స్ 3.5 శాతం ఇచ్చేందుకు మాత్రం వెనకాడుతోంది.

ఏండ్ల నుంచి పెండింగ్

2013 నుంచి దీన్ని అమలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటి నుంచి పలు కారణాలతో సర్వీస్ ట్యాక్స్‌ను వసూలు చేయడం లేదు. ప్రతిఏటా మహిళా సంఘాలకు రూ.10 వేల కోట్ల రుణాలను ఇప్పించడంలో సెర్ప్ సక్సెస్ అవుతోంది. ఇవన్నీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అయినప్పటికీ.. బ్యాంకులకు మాత్రం 12 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తున్నారు. సేవా రుసుం ఒప్పందం ప్రకారం 3.5 శాతం బ్యాంకులు సెర్ప్‌కు చెల్లించాల్సి ఉండగా.. దీనిలో 0.5 శాతం గ్రామ సమాఖ్యలకు, మూడు శాతం సెర్ప్‌కు ఇవ్వాల్సి ఉంటోంది. దీంతో గ్రామ సమాఖ్యల పరిధిలో పని చేస్తున్న వీఓఏలకు వేతనాలు, సంఘాల నిర్వహణకు వినియోగించాల్సి ఉంటోంది.

వేతనాలకు ఇబ్బందులుండవ్​

సెర్ప్ పరిధిలో 4,200 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో వీరిని పర్మినెంట్ చేస్తామని, ఆహార శుద్ధి కేంద్రాల నిర్వహణలో కీలకం చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించినా.. అమలు కావడం లేదు. మరోవైపు కొన్ని సమయాల్లో సిబ్బందికి ప్రతినెలా మొదటివారంలో వేతనాలు కూడా విడుదల చేయడం లేదు. అయితే బ్యాంకుల నుంచి సేవా రుసుం కింద రావాల్సిన 3.5 శాతం సొమ్మును రాబట్టుకుంటే సెర్ప్​ సిబ్బందికి వేతనాలు ఆశించినస్థాయిలో పెంచడమే కాకుండా గ్రామైక్య సంఘాలను బలోపేతం చేయడం, మౌలిక వసతులు కల్పించడం వీలవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో సెర్ప్ ద్వారా బ్యాంకుల నుంచి మహిళా సంఘాలకు రూ.10 వేల కోట్లను రుణంగా ఇప్పించారు. దీనికి సేవా రుసుంగా రూ.350 కోట్లు సెర్ప్‌కు తిరిగి ఇవ్వాల్సి ఉంది. వాస్తవంగా సెర్ప్ సిబ్బంది తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేస్తున్నారని, పే స్కేల్ ప్రకారం వేతనాలు ఇస్తే రూ.100 కోట్ల వరకు ప్రతిఏటా ఖర్చు అవుతుందని, అదే బ్యాంకుల నుంచి సేవా రుసుం వసూలు చేస్తే ప్రభుత్వంపై భారం ఉండదని పలుమార్లు విన్నవిస్తూనే ఉన్నారు.

ఎందుకు అడగడం లేదు

బ్యాంకుల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును రాబట్టుకోవడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క ఏడాది సర్వీస్​ ట్యాక్స్‌ను వసూలు చేయలేదు. ఈ అంశాన్ని సెర్ప్​ఉద్యోగ జేఏసీ పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది. మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులకు నివేదించింది. కానీ బ్యాంకుల నుంచి రాబట్టుకోవడంలో ఉదాసీనత కనబరుస్తోంది. ప్రస్తుతం వేతనాల కోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ సేవా రుసుంపై దృష్టి పెట్టాలని మరోసారి అధికారులకు విన్నవిస్తున్నారు.

బ్యాంకుల నుంచి వసూలు చేయాలి : సెర్ప్​ జేఏసీ

సెర్ప్ సంస్థకు సీఎం కేసీఆర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని, సీఎం చొరవ తీసుకుని బ్యాంకుల నుంచి సేవా రుసుంను వసూలు చేయాలని సెర్ప్ జేఏసీ ప్రతినిధులు కుంట గంగాధర్​రెడ్డి, ఏపూరి నరసయ్య, సుభాష్​గౌడ్, మహేందర్​రెడ్డి, సుదర్శన్​ విజ్ఞప్తి చేశారు. సెర్ప్​ సిబ్బందికి పేస్కేల్ వర్తింపజేయాలని, బ్యాంకుల నుంచి సర్వీస్​ ట్యాక్స్‌ను వసూలు చేసుకుంటే ప్రభుత్వంపై ఇబ్బంది ఉండదంటున్నారు. బ్యాంకులకు ప్రతినెలా వందల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని, కానీ తిరిగి రావాల్సిన సొమ్మును వసూలు చేసుకోవడంలో నిర్లక్ష్యం వద్దని, వసూలు చేసి వేతనాలపై నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed