తగ్గిన కరోనా పరీక్షల ధరలు

by Shyam |
తగ్గిన కరోనా పరీక్షల ధరలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా నిర్ధారణ పరీక్ష (ఆర్‌టీ-పీసీఆర్)ల రేటును రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఇప్పటిదాకా ప్రైవేటు లాబ్‌లలో రూ. 2,200 చొప్పున వసూలు చేస్తుండగా ఇకపైన అది రూ. 850కే లభించనుంది. ఇంటి దగ్గరకే వచ్చి శాంపిల్ తీసుకోడానికి ప్రస్తుతం రూ. 2,800 వసూలు చేస్తుండగా ఆ ధరను రూ. 1,200గా ఖరారు చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు లాబ్‌లు ఈ నూతన నిర్ణయాలను విధిగా అమలుచేయాల్సిందిగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ బుధవారం దీనిపై సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రైవేటు లాబ్‌లకు ఇప్పటికే సూచనప్రాయంగా ఈ అంశాలను తెలియజేసింది ప్రభుత్వం. ఒకటి రెండు రోజుల్లో సవరించిన ధరలతో ఉత్తర్వులను జారీ చేయనుంది.

కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు అనేక రాష్ట్రాల్లో ప్రైవేటు లాబ్‌లలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి మంజూరైనా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అనుమతి ఇవ్వలేదు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే చేసేలా కఠిన నిబంధనలను అమలుచేసింది. అయితే హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాలు, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి తదితరాలను దృష్టిలో పెట్టుకుని జూన్ నుంచి ప్రైవేటు లాబ్‌లు కూడా కరోనా పరీక్షలు చేసుకోవచ్చంటూ అనుమతి మంజూరు చేసి నిర్దిష్టంగా ధరలను ఖరారు చేసింది. ఇప్పటివరకూ అవే ధరలు అమలులో ఉన్నాయి.

కానీ దేశంలో అనేక ప్రైవేటు కంపెనీలు కరోనా ఆర్‌టీ-పీసీఆర్ కిట్‌లను ఉత్పత్తి చేస్తుండడంతో మార్కెట్‌లో వాటి ధరలు తగ్గాయి. ప్రస్తుతం లాబ్‌లు ఆర్‌టీ-పీసీఆర్ కిట్‌ను హోల్‌సేల్‌లో కేవలం రూ. 220, రీ-ఏజెంట్ కిట్‌ను రూ.50కు కొనుగోలు చేస్తున్నందున ప్రజలకు చేసే టెస్టు ధరను కూడా తగ్గించాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రేవేటు లాబ్‌లు ఎక్కువ ధరలు వసూలు చేస్తూ లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నందున ప్రజలకు అందుబాటులో ఉండేలా ధరలను తగ్గించాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వీలైనంతవరకు ప్రైవేట్ లాబ్‌లకు బదులుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయించుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed