కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి ప్రభుత్వం ఓకే!

by Shyam |
కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి ప్రభుత్వం ఓకే!
X

ల్లికి టైమొచ్చింది. గతేడాది చివర్లో ఉల్లి ఘాటు-రేటులతో ప్రజలందరి కళ్లలో కన్నీళ్లను-కాసులను ఖర్చు చేయించింది. వరద ప్రభావం కారణంగా అధిక ఉత్పత్తిని అందించే మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి సరఫరా ఆగిపోవడంతో ఢిల్లీ మొదలు దేశమంతా ఉల్లి రేటు భగ్గుమంది. దేశీయ మార్కెట్‌లో వస్తువుల లభ్యతను పెంచేందుకు, పెరిగిన ధరలను అదుపులో ఉంచేందుకు ఉల్లిపాయల ఎగుమతిని గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం నిషేధించింది. ఉల్లి వ్యాపారులపై ప్రభుత్వం స్టాక్ పరిమితులను విధించింది. ఇప్పుడు ఉల్లి టైం అయిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి. ఇప్పుడు కిలో ఉల్లి గరిష్టంగా రూ. 60 వరకు ఉంది. విరామం తర్వాత ఉల్లిని ఇతర దేశాలకు ఎగుమతులు ప్రారంభమయ్యాయి. అయితే, అన్ని ఉల్లి రకాలకు ఈ నిషేధం ఎత్తివేయలేదు.

వర్షాకాలం ఆలస్యమవడం, ప్రధాన ఉత్పాదక రాష్ట్రాల్లో అధిక వర్షాల కారణంగా అంతకుముందు ఏడాదికంటే 25 శాతం ఉల్లి దిగుబడి తగ్గింది. అప్పుడు తీసుకున్న ఉల్లి ఎగుమతి నిషేధం ప్రకటన కృష్ణాపురం ఉల్లి రైతులపై ప్రభావం చూపించింది. ఎందుకంటే కృష్ణాపురం ఉల్లి పాయలు పరిమాణంలోనూ, ఘాటులోనూ తినదగినది కాదు. ఇక్కడి రైతులు అవసరమైనంత మేరకే ఉంచుకుని మిగిలిన ఉల్లిని ఎగుమతి చేసేవారు. దీంతో కృష్ణాపురం ఉల్లిని ఎగుమతి చేసుకునేందుకు నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పార్లమెంట్‌లో కోరింది.

ఈ నేపథ్యంలో కేంద్రం కొన్ని షరతులతో 10,000 టన్నుల కృష్ణాపురం ఉల్లిని ఎగుమతి చేసుకునేందుకు అనుమతులు జారీ చేసింది. చెన్నై ఓడరేవు ద్వారా మాత్రమే ఈ ఎగుమతికి అనుమతి ఉందని, అది కూడా ఈ ఏడాది మార్చి 31 లోగా సరుకును రవాణా చేయాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కృష్ణాపురం ఉల్లిపాయలు పరిమాణం, ఘాటు కారణంగా స్థానిక వంటల్లో విరివిగా వాడరు. వీటిని థాయ్‌లాండ్, హాంకాంగ్, మలేషియా, శ్రీలంక, సింగపూర్ దేశాలు దిగుమతి చేసుకుంటాయి. కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు, కృష్ణాపురం ఉల్లిని ఎగుమతి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన విభాగం నుండి అనుమతులు పొందవలసి ఉంటుంది. అలాగే చెన్నైలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ జోనల్ కార్యాలయంలో ఎగుమతిదారు ఎగుమతి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని వివరించింది.

చెన్నైలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కార్యాలయం ఎగుమతికి అనుమతించబడిన మొత్తం పరిమాణాన్ని పర్యవేక్షిస్తుంది. దాని ఆధారంగా ధృవీకరణ పత్రాలను ఇస్తుంది. అలాగే, చెన్నైలోని నౌకాశ్రయ కస్టమ్స్ అధికారులు పరిశీలించి ఎగుమతి చేయడానికి అనుమతిస్తారు. ప్రస్తుతానికి కృష్ణాపురం ఉల్లికి మాత్రమే ఎగుమతులకు అవకాశం ఉంది. ఇతర ఉల్లిపాయలకు ఎగుమతులను నిషేధించారు.

Advertisement

Next Story

Most Viewed