వాయిస్ అసిస్టెంట్ సెట్టింగ్స్ మార్చిన గూగుల్

by Harish |
వాయిస్ అసిస్టెంట్ సెట్టింగ్స్ మార్చిన గూగుల్
X

తమ గూగుల్ అసిస్టెంట్‌లో మార్పులు చేస్తున్నట్లు గూగుల్ సంస్థ వినియోగదారులందరికీ బుధవారం రోజున మెయిల్ పంపించింది. ఇక నుంచి గూగుల్ అసిస్టెంట్‌లో ఆటోమేటిక్‌గా వినియోగదారుడి వాయిస్ రికార్డింగ్స్ సేవ్ చేయబోదని గూగుల్ తెలిపింది. అయితే ఆ రికార్డింగ్స్‌ను సేవ్ చేసే సదుపాయాన్ని అలాగే కొనసాగించాలనుకుంటున్న వినియోగదారులు అందుకు అనుమతిస్తూ సెట్టింగ్‌లు మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. స్మార్ట్ స్పీకర్లు, ఫోన్లు, ఇంకా ఇతర అన్ని పరికరాల్లోని గూగుల్ అసిస్టెంట్‌కి ఈ మార్పులు వర్తించనున్నాయి. ఇన్నాళ్లుగా తమ వాయిస్ అసిస్టెంట్ పనితీరును విశ్లేషించడానికి గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు అన్ని సంభాషణలు రికార్డు చేసి, స్టోర్ చేసేవి. తర్వాత వీటిని ఆయా సంస్థల సిబ్బంది విని, అసిస్టెంట్ ప్రవర్తనను అంచనా వేసి, మార్పులు చేసేవారు.

నిజానికి చాలా మంది యూజర్లు, ఈ వాయిస్ అసిస్టెంట్‌ల పనితీరును టెస్ట్ చేయడానికి వివిధ రకాలుగా మాట్లాడుతారు. అంతేకాకుండా కొన్నిసార్లు గూగుల్ అసిస్టెంట్‌తో వ్యక్తిగత విషయాలు కూడా షేర్ చేసుకుంటారు. ఇలా ఆ సంభాషణలు రికార్డు చేసుకుని వేరే వాళ్లు వినడం జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్‌ను ఉల్లంఘిస్తుండటంతో దీని మీద జర్మనీలో కేసు వేశారు. గూగుల్, అమెజాన్ కంపెనీల మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ తప్పును సరిదిద్దుకునే ఉద్దేశంతోనే గూగుల్ ఇక నుంచి ఈ సంభాషణలను రికార్డు చేసి, సేవ్ చేయబోమని నిర్ణయించుకుని వినియోగదారులకు ప్రైవసీ విధాన మెయిళ్లను పంపించినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed