జూన్‌లో పెరిగిన జీఎస్‌టీ వసూళ్లు

by Harish |
జూన్‌లో పెరిగిన జీఎస్‌టీ వసూళ్లు
X

దిశ, సెంట్రల్ డెస్క్: వస్తువులు, సేవా పన్నుల(జీఎస్‌టీ) వసూళ్లు జూన్ నెలలో గతేడాది ఇదే నెలతో పోలిస్తే 9 శాతం పెరిగినట్టు రెవెన్యూ శాఖ బుధవారం వెల్లడించింది. కరోనా వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ, లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో జూన్ నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ. 90,917 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో రూ. 18,980 కోట్లు కేంద్రం వాటా(సీజీఎస్‌టీ) కాగా, రూ. 23,970 కోట్లు రాష్ట్రాల వాటా(ఎస్‌జీఎస్‌టీ). కొవిడ్-19, లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలల్లో నమోదైన వాటి కంటే జూన్‌లో వసూళ్లు ఎక్కువ నమోదయ్యాయి. ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ. 32,294 కోట్లు కాగా, మే నెలలో రూ. 62,009 కోట్లు. 2019 ఏడాదితో పోలిస్తే 2020 ఏప్రిల్‌లో వసూళ్లు 72 శాతం, మేలో 38 శాతం తగ్గాయి.

ఇక ఉమ్మడి జీఎస్‌టీ రూ. 40,302 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి రూ. 13,325 కోట్లు, రూ. 11,117 కోట్లు ఎస్‌జీఎస్‌టీగా ప్రభుత్వం క్లియర్ చేసింది. కాగా, జీఎస్‌టీలో స్థూల రాబడిలో రూ. 7,665 కోట్లు సెస్ ఉంటే, వస్తువుల దిగుమతిపై రూ. 607 కోట్లు పన్ను రాబడి సమకూరింది. సెటిల్‌మెంట్ తర్వాత జూన్ నెలలో కేంద్రం రూ. 32,305 కోట్ల రాబడిని, రాష్ట్రాలు రూ. 35,087 కోట్ల రాబడిని ఆర్జించాయి. అలాగే, గతేడాది ఇదే త్రైమాసికంలో వసూలు చేసిన ఆదాయం కంటే ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీఎస్‌టీ వసూలు 41 శాతం తక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపింది. అయితే పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు 2020 మే నెల రిటర్న్ దాఖలు చేయడానికి ఇంకా సమయం ఉంది. ఇక, 2020-21 ఆర్థిక సంవత్సరానికి కరోనా వైరస్‌తో పాటు జీఎస్‌టీ రిటర్న్‌ల దాఖలుకు, పన్ను చెల్లింపులకు ప్రభుత్వం సడలింపులివ్వడంతో జీఎస్టీ వసూళ్లు దెబ్బతిన్నప్పటికీ క్రమంగా కోలుకోవడం ఊరటనిస్తోంది.

Advertisement

Next Story