రైతులకు శుభవార్త.. ఇకపై రుణం కోసం ఎవరికి దండం పెట్టనక్కర్లే..!

by Anukaran |   ( Updated:2021-12-19 06:42:36.0  )
రైతులకు శుభవార్త.. ఇకపై రుణం కోసం ఎవరికి దండం పెట్టనక్కర్లే..!
X

దిశ, నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్‌లోని అర్హులైన రైతులందరూ KCC(కిసాన్ క్రెడిట్ కార్డు)లను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. ఆదివారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ.. వృత్తిని నమ్ముకుని పని చేస్తున్న, ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ఒక వరమన్నారు. వృత్తిలో పెట్టుబడి కింద ఆర్థిక సహాయం చేయడమే కేసీసీ కార్డు లక్ష్యమని స్పష్టం చేశారు. పేద రైతులకు ఈ కార్డు అక్షయ పాత్రలా మారనుందన్నారు. 30 పైసల వడ్డీతో రూ.25 వేల నుంచి లక్షా 60వేల వరకు రుణం అందిస్తామన్నారు.

మొట్టమొదటి కిసాన్ క్రెడిట్ కార్డు నర్సంపేటలోనే అందించినట్టు గుర్తు చేశారు. భూమితో సంబంధం లేకుండా వ్యవసాయ ఆధార వృత్తిలో ఉన్న వారందరూ కేసీసీకి అర్హులని సూచించారు. ఇప్పటివరకు డివిజన్‌లోని నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా 1600 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సోమవారం నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 22 న పాడి రైతులకు నర్సంపేటలో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. దరఖాస్తు స్వీకరించిన నాటి నుంచి 30 రోజుల్లో కేసీసీ కార్డు వస్తుందన్నారు. ఇందుకోసం రెండు పాస్ ఫోటోలు, ఆధార్ కార్డు, వృత్తికి సంబంధించిన సొసైటీ ఐడీ కార్డు తీసుకురావాలన్నారు. తిరస్కరించిన దరఖాస్తుల విషయంలో సంబంధిత వ్యక్తికి తగు కారణాలతో మెసేజ్ చేరవేయనున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed