నేపాల్‌లో బంగారు తాబేలు!

by Harish |
నేపాల్‌లో బంగారు తాబేలు!
X

తాబేలు అనగానే సాధారణంగా బురదలో ఉండేదైతే నల్ల రంగులో, గోధుమరంగులో ఉంటుంది. అదే ఆక్వేరియంలో, సముద్రంలో పెరిగినదైతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కానీ బంగారు రంగులో ధగధగ మెరిసిపోతున్న తాబేలును ఎప్పుడైనా చూశారా? ఇటీవల పసిడి వర్ణంలో మెరిసిపోతున్న ఒక తాబేలు మొదటిసారిగా నేపాల్‌లోని ధనుషధామ్ అడవిలో కనిపించింది. మహావిష్ణువు అవతారాల్లో తాబేలు అవతారం కూడా ఒకటి కాబట్టి, దీన్ని విష్ణువు అవతారమని అక్కడి వాళ్లు కొలుస్తున్నారు. అయితే జన్యువులలోని పిగ్మెంటేషన్‌లో మార్పుల కారణంగా ఇలా బంగారు వర్ణంలోకి మారి ఉంటుందని మిథిలా వైల్డ్ లైఫ్ ట్రస్ట్ అధికారులు అంటున్నారు.

దీన్ని ఇండియన్ ‘ఫ్లాప్‌షెల్ టర్టిల్ లేదా లిస్సేమిస్ పంక్టాటా ఆండెర్సోనీ’ అని పిలుస్తారని వారు చెప్పారు. ఇలా బంగారు రంగులో మెరిసే పైకప్పు ఉండటాన్ని క్రొమాటిక్ ల్యూసిజం అని పిలుస్తారని వివరించారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి తాబేళ్లు కనిపించడం ఇది ఐదోసారి మాత్రమేనని ట్రస్ట్ వాళ్లు చెబుతున్నారు. ధనుషధామ్ నుంచి ఈ తాబేలును చంద్రదీప్ సాదా అనే యానిమల్ కీపర్ కాపాడి తీసుకొచ్చారు. దీని ఫొటోలను ట్రస్ట్ వారు తమ ఫేస్‌బుక్ ఖాతాలో అప్‌లోడ్ చేయగా, జంతుప్రియులు వీటిని విపరీతంగా షేర్ చేసి, వైరల్ చేశారు. ఈ తాబేలు జన్యుపరిస్థితి గురించి ప్రముఖ సరీసృపాల నిపుణులు కమల్ దేవ్‌కోట ఒక పరిశోధనాపత్రాన్ని కూడా ప్రచురించారు. నేపాల్‌లో తాబేలును దైవంగా పూజిస్తారు. అందుకే ఫొటోలు తీసేవరకు పట్టుకుని, ఆ తర్వాత దీన్ని అదే అడవిలో సురక్షితమైన ప్రాంతంలో వదిలేశారు. గత జులైలో ఒడిశాలో పసుపు రంగులో ఉన్న తాబేలు కనిపించిన సంగతి తెలిసిందే!

Advertisement

Next Story