ప్రకాశించే పుట్టగొడుగులు.. మీరు చూశారా?

by Anukaran |
ప్రకాశించే పుట్టగొడుగులు.. మీరు చూశారా?
X

దిశ, వెబ్‌డెస్క్ : జీవరాశులు తమ అవసరాలకు తగినట్లుగా ప్రకృతిలో ఇమిడిపోతాయి. అందుకు అనుగుణంగా కొన్ని జీవులకు స్వయం ప్రకాశిత శక్తి ఉంటుంది. జెల్లీఫిష్‌, మిణుగురు పురుగులు వంటివి మిణుకుమిణుకుమంటూ వెలుగుతాయని తెలిసిందే. కానీ వెలిగే పుట్టగొడుగుల గురించి ఎప్పుడైనా విన్నారా? ఈశాన్య భారతదేశంలో పుట్టగొడుగుల జాతుల గురించిన డాక్యుమెంటేషన్ ప్రాజెక్ట్ జరిగింది.

అందులో భాగంగా ఇప్పటివరకు 600 రకాల పుట్టగొడుగు జాతులను గుర్తించారు. వాటిలో ఒక పుట్టగొడుగు జాతి మాత్రం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పుట్టగొడుగు జాతి పేరు ‘రొరిడోమైసెస్ ఫైలోస్టాకైడిస్’. మొదటిసారిగా ఇవి మేఘాలయ, తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని మావిలినాంగ్‌లో కనిపించాయి. తర్వాత పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో ఉన్న క్రాంగ్ షూరీ వద్ద కనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 97 రకాల వెలిగే పుట్టగొడుగుల జాతుల్లో ఇదొకటని శాస్త్రవేత్తలు తెలిపారు.

2018 ఆగస్టులో అసోంకు చెందిన బలిపరా ఫౌండేషన్ వారు, కున్మింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బోటనీ శాస్త్రవేత్తలతో కలిసి అసోం, మేఘాలయా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఫంగల్ బయోడైవర్సిటీని అంచనా వేసే ప్రాజెక్ట్ చేపట్టారు. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా వెలిగే పుట్టగొడుగులు భారతదేశంలో ఉన్నాయా లేవా అని అన్వేషణ ప్రారంభించారు. ఈ అన్వేషణలో భాగంగా స్థానికులను వీటి గురించి అడిగేవారు. చివరకు మేఘాలయ వాసులకు ఈ వెలిగే పుట్టగొడుగులు కనిపించాయి.

ఈ పుట్టగొడుగులో ఉన్న ‘లుసిఫెరాస్ ఎంజైమ్’ కారణంగా ఆక్సిజన్ సమక్షంలో ఇది వెలుగుతోందని, లోపల జరిగే విభిన్న చర్యల ద్వారా వెలువడిన ఎనర్జీ ఇలా వెలుతురు మాదిరిగా కనిపిస్తోందని మైకాలజిస్ట్ సమంతా కరుణారత్న తెలిపారు. ఇలా వెలిగి కీటకాలను, దోమలను ఆకర్షించడం ద్వారా వాటి స్పోర్‌లను వెదజల్లి, ఈ పుట్టగొడుగులు తమ జాతిని వృద్ధి చేసుకుంటాయని ఆమె వివరించారు. భారతదేశంలోని పశ్చిమ కనుమలు, తూర్పుకనుమలలో కూడా ఇలాంటి వెలిగే పుట్టగొడుగులు ఉండవచ్చని ఆమె అన్నారు.

Advertisement

Next Story