- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుబంధులో కాసుల వేట
దిశ, న్యూస్ బ్యూరో: రైతుబంధులో కాసుల వేట మొదలైంది. ఉన్నదాంట్లోనే సాధ్యమైనంత వరకు మిగుల్చుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. గతంలో మూడు విడతల్లో పట్టించుకోని ‘గివ్ ఇట్ అప్’పై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టింది. అసలే కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సర్కారు పెట్టుబడి సాయం నుంచి వీలైనంత మిగుల్చుకోవాలని చూస్తోంది.
పెట్టుబడి సాయంగా రైతులకు అందించే రైతుబంధు పథకంలో ఏటేటా సర్కారుకు ఎంతో కొంత మిగులుతూనే ఉంది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ అనుసంధానంతో పాటు ఇతర సాంకేతిక కారణాలతో మూడు విడతల్లో 18.45 లక్షల మంది రైతులకు సాయమందలేదు. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కోటి 47 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిలో భాగంగా మార్గదర్శకాలు సైతం జారీ అయ్యాయి. మార్గదర్శకాల్లో ఈసారి ‘గివ్ ఇట్ అప్’ను ప్రభుత్వం నొక్కిచెప్పింది. వ్యవసాయ భూమి ఉన్నా పంటలు సాగు చేయని రైతులు పెట్టుబడి సాయాన్ని వదులుకోవాలని ప్రభుత్వం విన్నవిస్తూనే ఉంది. దీనిపై ఇప్పుడు ఎంతమంది స్పందిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.
సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలు ఇచ్చినవారు రైతుబంధు వదులుకుంటారా?
కరోనా కాలంలో ప్రభుత్వానికి వ్యాపార వర్గాలు, ఉద్యోగ వర్గాలు కోట్ల రూపాయలను సీఎంఆర్ఎఫ్‌కు అందించాయి. రాష్ట్ర ఖజానాలో నిధులు లేవన్న ప్రభుత్వానికి విరాళాల రూపంలో కొంత సమకూరింది. ఉద్యోగులు కూడా వేతనంలో కొంత భాగాన్ని ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటుగా ప్రజాప్రతినిధుల రెండు నెలల వేతనాలను సీఎంఆర్ఎఫ్‌కు బదిలీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం నిధులను కూడా గ్రామాభివృద్ధికి, వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలనుకుంటోంది. ఈ పరిస్థితుల్లో వానాకాలం రైతుబంధు సాయంలో కొంతైనా మిగుల్చుకోడానికి ప్రయత్నిస్తోంది. ప్రభుత్వానికి తోచిన సాయం చేస్తున్నామని ముందుకొచ్చిన ఆ పెద్దల్లో చాలా మందికి పదుల ఎకరాల్లో సాగుభూములు ఉన్నాయి. అదే ఉదార స్వభావాన్ని ఇప్పుడు కూడా రైతుబంధు రూపంలో వచ్చే డబ్బును ఏ మేరకు వదులుకోనున్నారో త్వరలో స్పష్టమవుతుంది.
గతంలో తక్కువే
రైతుబంధు మొదలైన తొలినాళ్లలో ప్రభుత్వం ‘గివ్ ఇట్ అప్’కు పిలుపునిచ్చింది. ఎక్కువ భూమి ఉన్న సంపన్న రైతులు తమకు వచ్చే రైతుబంధును ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని, వాటిని రైతుబంధు సమన్వయ సమితి ఖాతాల్లో జమ చేస్తోందని చెప్పింది. ఆ ప్రకారం తొలి విడతలో ముందుకు వచ్చిన పెద్ద రైతులు ఆ తర్వాత మూడు విడతల్లో మొండిచేయే చూపించారు. రైతుబంధు సొమ్మును వెనక్కి తిరిగిచ్చిన వారి జాబితా పదుల సంఖ్యకే పరిమితమైంది.
పెద్ద కాపుతో సహా!
‘‘ నేను కూడా రైతు బిడ్డనే. నేనూ కాపోడ్నే’’ అంటూ రైతులకు సంబంధించిన ప్రతి అంశంపైనా సమావేశాల్లోనైనా చెప్పే సీఎం కేసీఆర్ రైతుబంధు సొమ్మును తొలి విడతలో మాత్రమే వదులుకున్నారు. మొదటి విడతలో రైతుబంధు తీసుకోని సీఎం ఆ తర్వాత మాత్రం వెనక్కి ఇవ్వలేదు. ఎక్కువ వ్యవసాయ భూములున్నాయని చెప్పుకునే టీఆర్ఎస్ నేతలు కూడా రైతుబంధును వదులుకోలేదు. తొలి విడతలో మొత్తం 1543 మంది రైతులు రూ.2.46 కోట్లు మాత్రమే వెనక్కి ఇచ్చారు. రెండో విడతలో కేవలం 29 మంది రూ.4.72 లక్షలు, మూడో విడతలో కేవలం నలుగురు రైతులు రూ.1.19 లక్షలను వెనక్కి ఇచ్చారు. గివ్ ఇట్ అప్ కింద మూడు విడతల్లో 1576 మంది రైతులు రూ.2.52 కోట్లు మాత్రమే వాపసు ఇచ్చారు. దీన్ని మొదట్లో అతిపెద్దగా ప్రచారం చేసుకున్నప్రభుత్వం ఆ తర్వాత ఈ సంగతినే మర్చిపోయింది.
వాపసు ఇస్తే బయటపడమా..!!
టీఆర్ఎస్ నేతలకు వందల ఎకరాల భూములున్నాయనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో వందల ఎకరాలు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉన్నాయనే విషయం ప్రచారంలో ఉంది. ఇక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సన్నిహితులుగా ఉండేవారు, ప్రగతిభవన్ వేదికగా రాజకీయాలు చేస్తున్నవారిలో చాలామందికి వందల ఎకరాల వ్యవసాయ భూములున్నాయనే ప్రచారమూ ఉంది. అయితే ఒక్కరు కూడా బహిరంగంగా రైతుబంధు సొమ్మును వాపసు ఇవ్వలేదు. రైతుబంధు సొమ్మును వాపసు ఇస్తే భూముల వివరాలు ఎక్కడ బహిర్గతమవుతాయనే భయంతో తిరిగి ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నేతల్లోనే చర్చ ఉంది. కుటుంబ సభ్యులు, బినామీల పేరిట వందల ఎకరాల భూములున్నాయని, వాటికి వచ్చే రైతుబంధు చెక్కులను తిరిగి అప్పగిస్తే పెద్దసారు దగ్గర ముద్ర పడుతుందనే భయంతో ఇవ్వడం లేదనే నేతలూ ఉన్నారు. ఇక సీఎం కేసీఆర్ రైతుబంధు తీసుకుంటుండగా తామెందుకు వదులుకోవాలనే ఉద్దేశం కలిగిన వారు కూడా చాలామందే ఉన్నారు.
కలెక్టర్ల దగ్గర గివ్ ఇట్ అప్ పత్రాలు
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ‘గివ్ ఇట్ అప్’పై చాలా ఆశలు పెట్టుకుంది. గ్రామస్థాయి నుంచి విస్తృత ప్రచారం చేయాలని ఉత్తర్వుల్లో అధికారులు స్పష్టం చేశారు. వ్యవసాయ భూమి ఉన్నా సాగు చేయని రైతుల నుంచి తిరిగి ఇప్పించాలని నేతలకు సూచిస్తున్నారు. దీంతోనైనా జిల్లాలవారీగా ఎంతోకొంత మంది తిరిగి ఇస్తారనే ఆశతో ఉన్నారు. ఇప్పటికే ఆర్థికంగా లోటులో ఉన్న ప్రభుత్వం రైతుబంధు ద్వారా రూ.7 వేల కోట్లను రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు నిధులు విడుదల చేస్తోంది. రూ.5,500 కోట్లు విడుదల చేసింది. మిగిలిన సొమ్మును నాలుగైదు రోజుల్లో వ్యవసాయ శాఖకు బదిలీ చేయనుంది. ఈ నేపథ్యంలో పెద్ద కాపులు తమ రైతుబంధు సొమ్మును తిరిగి ఇవ్వాలని కోరుతోంది. గతంలో లేని విధంగా మార్గదర్శకాల్లో సూచించింది. మండలాల్లో ఏఈఓలకు వాపసు పత్రాలు ఇచ్చినా సరిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇలాగైనా పెద్ద కాపులు తిరిగి ఇస్తారని ఆశ పెట్టుకుంది.
ఇక రైతుబంధు రెండు, మూడో విడతలో సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే సిద్ధిపేట జిల్లా నుంచి ఒక్క రైతు కూడా తిరిగి ఇవ్వలేదు. తొలి విడతలో 30 జిల్లాల పరిధిలో రైతులు ఎంతో కొంత వాపసు ఇచ్చారు. రెండో విడతలో జగిత్యాల, ఖమ్మం, సంగారెడ్డి, మేడ్చల్, వనపర్తి, వరంగల్ అర్భన్, యాదాద్రి-భువనగిరి జిల్లాల నుంచి 29 మంది, మూడో విడతలో సంగారెడ్డి జిల్లా నుంచి నలుగురు రైతులు మాత్రమే రైతుబంధు తిరిగి ఇచ్చారు. పెద్ద కాపుల భూములున్న రంగారెడ్డి, హైదరాబాద్, సిద్ధిపేట వంటి జిల్లాల నుంచి ఒక్క రైతు కూడా పెట్టుబడి సాయాన్ని వదులుకోలేదు.
రైతుబంధు గివ్ ఇట్ అప్
ఫేజ్ | మొత్తం జిల్లాలు | తిరిగి ఇచ్చిన రైతులు | సొమ్ము రూ.కోట్లలో |
తొలి విడత | 30 | 1543 | 2,46,60,870 |
రెండో విడత | 7 | 29 | 4,72,830 |
మూడో విడత | 1 (సంగారెడ్డి) | 4 | 1,19,800 |
మొత్తం | 1576 | 2,52,53,500 |