ల‌క్ష మంది కార్మికుల‌కు భోజ‌న వ‌స‌తులు : మేయర్

by Shyam |
ల‌క్ష మంది కార్మికుల‌కు భోజ‌న వ‌స‌తులు : మేయర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్‌లో ఉపాధిలేక ఇబ్బంది ప‌డుతున్న పేద‌లు, వ‌ల‌స కార్మికుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. ఆదివారం చ‌ర్ల‌ప‌ల్లి డివిజన్‌లో రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ చైర్మ‌న్ మారెడ్డి శ్రీ‌నివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్ వాసం వెంక‌టేశ్వ‌ర్లుతో క‌లిసి వలస కూలీలకు 12 కిలోల బియ్యం, రూ.500 చొప్పున న‌గ‌దు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ ఏ ఒక్క‌రూ ఆక‌లితో ఇబ్బంది ప‌డ‌రాద‌నే సంక‌ల్పంతో పేద‌లు, వ‌ల‌స కార్మికుల సంక్షేమానికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌తనిస్తున్న‌ట్లు తెలిపారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప‌నులు నిలిచిపోయినందున 280 ప‌ని ప్ర‌దేశాల్లోనే భోజ‌న వ‌స‌తులు, ఆరోగ్య సంర‌క్ష‌ణ చూడాల్సిన బాధ్య‌త ఆయా నిర్మాణ సంస్థ‌లపైనే ఉందన్నారు. అసంఘ‌టిత రంగంలో ఉపాధి పొందుతున్న 2 ల‌క్ష‌ల 71 వేల 742 మంది వ‌ల‌స కార్మికుల‌ను గుర్తించి, వారి ఆక‌లి తీర్చేందుకు రెండు విడత‌ల్లో 3,260 మెట్రిక్ ట‌న్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఒక్కొక్క‌రికి రూ. 500 ల చొప్పున రూ. 13 కోట్ల 58 ల‌క్ష‌ల 71 వేల న‌గ‌దును అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌రాద‌నే ఉద్దేశంతో రెండు నెల‌ల‌కు స‌రిప‌డా బియ్యాన్ని ప్ర‌భుత్వం ఉచితంగా ఇస్తున్న‌ట్లు తెలిపారు. అనేక మంది పెద్ద‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు పేద‌ల‌కు అన్న‌దానం చేసేందుకు, నిత్యావ‌స‌రాల‌ పంపిణీకి ముందుకు వ‌చ్చిన‌ప్ప‌టికీ, సామాజిక దూరాన్ని అమ‌లు చేయాల‌నే ఉద్దేశంతో నోడ‌ల్ అధికారులను నియ‌మించిన‌ట్లు తెలిపారు. అన్న‌దానం, నిత్యావ‌స‌రాలు ఇవ్వాల‌నుకునే దాత‌లు జీహెచ్‌ఎంసీ నోడ‌ల్ అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు. జీహెచ్‌ఎంసీ ద్వారానే నిత్య‌వ‌స‌రాల పంపిణీ నిర్వ‌హించాల‌ని సూచించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు సామాజిక దూరాన్ని పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

Tags : Lock down, GHMC, Mayor, Rice distribution, daily needs, Nodal Officer

Advertisement

Next Story