వ్యాక్సిన్ వేసుకో.. అపార్ట్‌మెంట్ గెలుచుకో!

by Shyam |
New-Apartment
X

దిశ, ఫీచర్స్: కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ప్రపంచ దేశాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా టీకాలు తీసుకునేందుక ముందుకురాగా, కొంతమంది ఇప్పటికీ వ్యా్క్సిన్ తీసుకునేందుకు సంకోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలు వ్యాక్సిన్ తీసుకున్నవారికి రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వ డేటింగ్ యాప్‌లో ఆఫర్స్ అందించగా, కాలిఫోర్నియా గవర్నమెంట్ వ్యాక్స్ ఫర్ ది విన్’ పేరుతో కోట్లాది రూపాయల క్యాష్ ప్రైజ్ అందిస్తోంది. ఇక థాయ్‌లాండ్‌లో టీకాలు వేసుకున్న వారికి లాటరీ పద్ధతిలో ఆవును అందించే వినూత్న పథకం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో హాంకాంగ్ కూడా చేరింది. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకున్న హాంకాంగ్ వాసులకు అపార్ట్‌మెంట్ బహుమతిగా అందించనున్నారు.

ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా అడ్డుకోవడంలో విఫలమవగా, హాంకాంగ్ మాత్రం విజయవంతమైంది. అక్కడ ఇప్పటివరకు 11వేలకు పైగా మాత్రమే కరోనా కేసులు నమోదవగా, కేవలం 210మంది మాత్రమే కొవిడ్‌కు బలయ్యారు. దాదాపు 75లక్షల మంది జనాభా ఉన్న హాంకాంగ్‌లో ఇప్పటికే అందరికీ సరిపడా టీకాలున్నాయి. అయితే యాక్టివ్ కేసులు అంతగా లేకపోవడం, టీకా వేసుకోవడం అత్యవసర అవసరమేమి కాకపోవడంతో ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. టీకాలు వేయించుకోవటానికి పౌరులను ప్రోత్సహించడంలో భాగంగా హాంకాంగ్ ప్రభుత్వం ఇప్పటికే బార్లు తిరిగి తెరవడం, నిర్బంధాలను తగ్గించడం వంటి వివిధ రకాల ప్రయత్నాలను చేస్తోంది. అయినా 12.6 శాతం( అన్ని వయసుల వారికి టీకా అందుబాటులో ఉండగా) మంది మాత్రమే రెండు మోతాదులను తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రజలను ఆకర్షించేందుకు.. సినో గ్రూప్, ఆర్గ్ ఎన్జి టెంగ్ ఫాంగ్ ఛారిటబుల్ ఫౌండేషన్, చైనీస్ ఎస్టేట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లు సంయుక్తంగా తమ గ్రాండ్ సెంట్రల్‌లో వ్యాక్సిన్ పొందే పౌరులకు సరికొత్త 449 చదరపు అడుగుల (42 చదరపు మీటర్ల) అపార్ట్‌మెంట్‌ను అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ అపార్ట్‌మెంట్ ధర 1.4 మిలియన్ డాలర్లు కాగా, రెండు వ్యాక్సిన్ మోతాదుల వ్యాక్సిన్ పొందిన వారిలో డ్రా పద్ధతిన విజేతను ఎంపిక చేయనున్నారు. హాంకాంగ్ నివాసితులు మాత్రమే ఈ బంపర్ ఆఫర్‌కు అర్హులు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ధరలను కలిగి ఉన్న హాంకాంగ్‌లో ఉచిత అపార్ట్‌మెంట్ ఇస్తుండటంతో ఇప్పుడైనా ప్రజలు వ్యాక్సిన్ డ్రైవ్‌లో పాల్గొంటారని నిర్వహకులు భావిస్తున్నారు. కొవిడ్ టీకా తీసుకున్న వారికి ప్రోత్సహాకాలను అందించిన జాబితాలో.. అమెరికా రాష్ట్రాలైన న్యూయార్క్, ఒహియో, మేరీల్యాండ్, కెంటుకీ, ఒరెగాన్‌లు కూడా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed