- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కొక్కరికి ఐదు కిలోల ఉచిత రేషన్.. ఉత్తిదేనా!
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన నేపథ్యంలో పేదలకు రెండు నెలల పాటు ఉచిత రేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద ఒక్కొక్కరికీ ఐదు కిలోల రేషన్ బియ్యాన్ని మే, జూన్ నెలల్లో ఇవ్వాలని ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఇంకా ఈ ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కాలేదు. ప్రస్తుతానికి రెగ్యూలర్‌గా ఇచ్చే రూపాయికి కిలో బియ్యం.. యూనిట్‌కు 6కిలోల చొప్పున ఇస్తున్నారు. సర్కారు నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు.. అదనపు కోటా కేటాయించలేదని రేషన్ డీలర్లు చెబుతున్నారు.. మరోవైపు లాక్‌డౌన్ కారణంగా నాలుగు గంటలే రేషన్ దుకాణాలు తెరిచి ఉంచుతుండగా.. ఉదయం పూట సిగ్నల్ రాక అవస్థలు పడుతున్నారు..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మొత్తం 7,43,839రేషన్ కార్డులు ఉండగా.. వీటికి ప్రతి నెలా 15,207మెట్రిక్ టన్నుల బియ్యం కోటా కేటాయిస్తున్నారు. గతేడాది కరోనా సమయంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రేషన్ పంపిణీ చేశారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం మే, జూన్ నెలల్లో రేషన్ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద ప్రతి పేదవాడికి రెండు నెలలు అయిదు కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు ఉచితంగా సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ ప్రకారంగానే రాష్ట్రాల నుంచి ఇండెంట్ కోరగా.. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో తెలంగాణలోని తెల్లరేషన్ కార్డుదారులు నష్టపోవాల్సి వస్తోందని ‘దిశ’ ప్రధాన పత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లటంతో ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం లేదా గోధుమల పంపిణీ అమలుకు నోచుకోలేదు. అప్పటికే జిల్లాల్లో రేషన్ దుకాణాలకు కోటా కేటాయింపు పూర్తవగా.. లబ్ధిదారులకు బియ్యం పంపిణీ కూడా ప్రారంభం అయింది. ప్రస్తుతం రూపాయికి కిలో చొప్పున యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఉచితంగా ఐదు కిలోల బియ్యం ఇచ్చే విషయంలో తమకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు అందలేదని జిల్లాల ఫౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల కార్డులు వేర్వేరుగా ఉన్నాయని, ఉచిత బియ్యం పంపిణీపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఉచిత బియ్యం పంపిణీ కోసం తమకు అదనపు కోటా కేటాయించలేదని.. అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున పాత పద్ధతిలోనే బియ్యం పంపిణీ చేస్తున్నామని రేషన్ డీలర్లు అంటున్నారు. ఇక అంత్యోదయ కార్డులు ఉన్న వారికి కిలో చక్కెర రూ.15 చొప్పున పంపిణీ చేస్తున్నారు.
ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉన్నందున నాలుగు గంటలే రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య నాలుగు గంటలే బియ్యం పంపిణీ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో బయో మెట్రిక్ విధానం వద్దని డీలర్లు కోర్టుకు పోయారు. దీంతో ఫోన్ ఓటీపీ లేదా ఐరీష్ విధానంలో రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఉదయం పూట నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగా ఉండకపోవటంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంట నుంచి గంటన్నర పాటు సిగ్నల్ రాక ఇబ్బందులు పడుతామని.. మిగతా సమయంలో 30 నుంచి 40 కార్డులకే రేషన్ ఇస్తున్నామని చెబుతున్నారు. ఉదయం పూట రద్దీ ఎక్కువగా ఉండటంతో.. కరోనా తీవ్రత ఎక్కువ ఉండటంతో తమకు ప్రబలే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. ఇక మారుమూల మండలాలు, పల్లెలు, ఆదివాసీ తండాలు, గూడెంలలో నెట్వర్క్ సిగ్నల్ రాక మరింత సమస్యగా మారింది. గతంలో 15 రోజుల పాటు రేషన్ పంపిణీ చేయగా.. ప్రస్తుతం ఈ విషయంలో ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు లేకపోవటం కాస్తా ఉపశమనం కలిగిస్తోంది.