బాలల రక్షణ వాహనాన్ని ప్రారంభించిన గండ్ర

by Sridhar Babu |   ( Updated:2021-12-21 02:50:11.0  )
Collector1
X

దిశ, భూపాలపల్లి: ఆపదలో ఉన్న పిల్లల సంరక్షణ నిమిత్తం 1098 బాలల రక్షణ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి, జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర్, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి శ్యాముల్ తో కలిసి ఆ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్న పిల్లల గురించి ప్రత్యేక శ్రద్ధతో ఈ వాహనాలను కేటాయించారని, అందులో భాగంగానే జిల్లాకు కేటాయించిన వాహనం ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా మాట్లాడుతూ బాలల సంరక్షణ ధ్యేయంగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అహర్నిశలు కృషి చేస్తోందని, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎవరైనా ఆపదలో ఉన్న పిల్లల రక్షణ నిమిత్తం 1098 కాల్ చేసిన నిమిషాల వ్యవధిలో ఈ వాహనం అక్కడికి వచ్చి ఆపదలో ఉన్న బాలలను రక్షిస్తుందన్నారు. పిల్లల సంరక్షణలో భాగస్వాములై పనిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకట రాణి, బాల రక్షా భవన్ కో-ఆర్డినేటర్ శిరీష, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ దాస్యం వేణుగోపాల్, జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ, సీడీపీఓలు అవంతిక, రాధిక సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story