కరోనా మృతదేహం తారుమారు.. వైద్యులపై దాడి

by Sumithra |
కరోనా మృతదేహం తారుమారు.. వైద్యులపై దాడి
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా పేషెంట్ల, మృతుల లెక్కల్లో మాత్రమే కాదు మృతదేహాలను అప్పగించడంలోనూ లోపాలు జరుగుతున్నాయి. మృతదేహాలు తారుమారవుతున్నాయి. నగరంలోని బేగంపేటలోని గురుమూర్తి నగర్‌కు చెందిన ఒక కరోనా బాధితుడు మంగళవారం మృతిచెందగా బంధువులకు సమాచారం ఇచ్చిన వైద్యులు ఆ మృతదేహానికి బదులుగా మరో మృతదేహాన్ని అప్పగించారు. కరోనా కారణంగా చనిపోవడంతో జీహెచ్ఎంసీ, ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని శ్మశానం వరకూ తీసుకెళ్లారు. అంత్యక్రియల్లో భాగంగా చివరి నిమిషాల్లో మృతుడి భార్యకు ఆ మృతదేహం ముఖాన్ని చూపించారు. కానీ మృతుడు తన భర్త కాదని ఆమె వాపోయింది. చేసేదేమీలేక చివరకు మృతదేహాన్ని మళ్లీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అసలు మృతదేహాన్ని అప్పగించారు.

ఈ నిర్లక్ష్యంతో ఆగ్రహానికి గురైన మృతుడి బంధువు వైద్యులతో వాదనకు దిగారు. చివరకు ఇది ఘర్షణగా మారింది. కోపం తట్టుకోలేకపోయిన మృతుడి బంధువులు డ్యూటీ డాక్టర్లపై చేయిచేసుకున్నారు. ప్లాస్టిక్ ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఇనుప స్టూలుతో దాడి చేశారు. ఓ డాక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి ఆవరణలో ధర్నాకు దిగారు. కేవలం కరోనా పేషెంట్లకు మాత్రమే చికిత్స చేస్తున్న గాంధీ ఆసుపత్రిలోని పేషెంట్లలో కొద్దిమందిని ఇతర ఆసుపత్రులకు మార్చాలని, ప్రతీ ఐసీయూ వార్డు దగ్గర సాయుధ స్పెషల్ పోలీసుల్ని నియమించాలని, దాడికి పాల్పడినవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి శిక్షించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల బంధువులకు, డాక్టర్లకు మధ్య జరిగిన ఘర్షణ సంఘటనల్లో ఇది రెండవది.

Advertisement

Next Story