దుమారం రేపుతున్న గంభీర్ ఉచిత మందుల పంపిణీ

by Shiva |
దుమారం రేపుతున్న గంభీర్ ఉచిత మందుల పంపిణీ
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఫాబి ఫ్లూ మందులను ఉచితంగా పంచడం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నది. కరోనా కారణంగా ఢిల్లీలో మెడిసిన్స్ కొరత తీవ్రంగా ఉన్న సమయంలో పార్లమెంట్ సభ్యుడు గంభీర్‌కు అంత భారీ మొత్తంలో ఔషధాలు ఎలా లభించాయని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ నాయకులు ఇలా భారీ మొత్తంలో మందులు సేకరించి అనధికారికంగా పంచుతున్నందు వల్లే మెడికల్ షాపుల్లో మందుల కొరత ఏర్పడుతున్నదని వారు ఆరోపిస్తున్నారు.

‘కరోనా సమయంలో మనందరం మనుగడ సాధించాలంటే ఒకరికి ఒకరం అండగా ఉండాలి. ఢిల్లీలో వీలైనంత మందికి ఫాబీ ఫ్లూ అందించాలని నిర్ణయించాము. గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ కార్యాలయంలో రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఉచితంగా ఈ మందులు అందిస్తాము. అందరూ ఆధార్, ప్రిస్కిప్షన్ తీసుకొని రండి. ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందిస్తాం’ అని గత ఏప్రిల్‌లో గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశాడు. అయితే రాష్ట్రంలో ఔషధాల కరువు ఉంటే గంభీర్ తన ఫౌండేషన్ ద్వారా భారీగా మందులు ఎలా సరఫరా చేయగలుగుతున్నాడని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నారు. ‘ఫాబీ ఫ్లూ అంశాన్ని ప్రతిపక్షాలు చేయవద్దు. ఢిల్లీ పోలీసులకు అన్ని వివరాలు అందించాము. నా శక్తి మేర ఢిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు సిద్దంగా ఉన్నాను’ అని గౌతమ్ గంభీర్ మే 14న మరో ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed