సిద్దిపేట సబ్‌ రిజిస్టార్ ఆఫీసులో భారీ కుంభకోణం.. విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లు, ప్రతీ పనికో రేటు..!

by Shyam |   ( Updated:2021-11-08 08:26:42.0  )
సిద్దిపేట సబ్‌ రిజిస్టార్ ఆఫీసులో భారీ కుంభకోణం.. విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లు, ప్రతీ పనికో రేటు..!
X

దిశ ప్రతినిధి, మెదక్ : ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని సమకూర్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతి, అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రయివేటు వ్యక్తులను, రైటర్ల ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఇలాఖాలోని సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. స్థానికంగా ఉండే బీజేపీ నాయకులు ఈ అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతున్నారు.

ఆగని ఆక్రమాలు..

రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చాక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యవసాయ భూముల మార్పిడి ప్రక్రియ ఆగిపోయింది. ధరణి పోర్టల్ ద్వారా భూ క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి. కానీ, సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అందుకు విరుద్ధం. ఎల్‌ఆర్ఎస్ ప్రవేశపెట్టినా, ధరణి పోర్టల్ తీసుకొచ్చినా అక్రమ రిజిస్ట్రేషన్లు ఆగడం లేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాసుబుక్ నుండే రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఇందులో పైచేయి అధికార టీఆర్ఎస్ నాయకులదేనని తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్ నాయకులు అండదండలతోనే భారీగా అవినీతి జరుగుతోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సుమారు రూ .12 కోట్ల మేర అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని, ఎవరెవరూ ఎంతెంత వాటాలు పంచుకుంటున్నారనేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

ప్రతీ పనికో రేటు ..

సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతీ పనికి ఓ రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు ఒక్కోదానికి ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. ఒక వ్యక్తి ప్లాటు రిజిస్ట్రేషన్ చేయాలంటే దాదాపు రూ. పదివేలు ముట్టజెప్పాల్సిందే. ఇక మ్యారేజ్ సర్టిఫికేట్, ధరణి మ్యుటేషన్, భూముల మార్కెట్ వాల్యుయేషన్, సర్టిఫికేట్లు ఇచ్చేందుకు ముడుపులు చెల్లించాల్సిందే. ఇలా ప్రతీ పనికో రేటును నిర్ణయిస్తూ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేసే డాక్యుమెంట్లు రైటర్లు, ఇతర ప్రయివేటు వ్యక్తులను పెట్టుకుని మరీ ముడుపులు వసూలు చేస్తున్నారు. దీనిపై గతంలోనూ ఏసీబీకి ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధకారుల తీరు మారడం లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా రిజిస్ట్రేషన్ శాఖ తీరు మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో అవినీతి..

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేట‌లోనే పాస్‌బుక్ నుంచి రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఒక్క ప్లాటుకు రూ.15 వేల చొప్పున కమిషన్ వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.12 కోట్ల కుంంభకోణం జరిగింది. త్వరలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకుల అవినీతి, ఎవరెవరికి ఎన్ని వాటాలు వచ్చాయో వారి బాగోతం బహిర్గతం చేస్తాను.

-కొత్తపల్లి వేణుగోపాల్, బీజేపీ నాయకులు

Advertisement

Next Story