ఫ్రాన్స్‌లో మే 11 వరకు లాక్‌డౌన్

by vinod kumar |   ( Updated:2020-04-14 08:08:06.0  )
ఫ్రాన్స్‌లో మే 11 వరకు లాక్‌డౌన్
X

ప్యారిస్ :

యూరోప్ దేశాల్లో కరోనా మహమ్మారి ఎంతలా కబలించేస్తోందో అందరం చూస్తూనే ఉన్నాం. ఇటలీ, స్పెయిన్ దేశాలలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవడమే కాకుండా.. మరణాల సంఖ కూడా అధికంగానే ఉంది. ఈ రెండు దేశాలు సరిహద్దులుగా ఉన్న ఫ్రాన్స్‌లో కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. విదేశీ టూరిస్టులు అధికంగా వచ్చే ప్రదేశాలలో ఫ్రాన్స్‌ రాజధాని పారిస్ కూడా ఒకటి. దీంతో అక్కడి ప్రభుత్వం ముందుగానే మేల్కొని కరోనా కట్టడికై లాక్‌డౌన్ ప్రకటించింది. ఇండియా కంటే ముందుగానే మార్చి 17న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ లాక్‌డౌన్ ప్రకటించాడు. కాగా, ఇప్పుడు లాక్‌డౌన్ ముగిసిపోతుండటంతో దీనిని మే 11 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ”ప్రాణాంతకమైన కరోనా వైరస్ కట్టడికి పలు దేశాలు ఆచరిస్తున్న లాక్‌డౌన్‌ను మనం కూడా కట్టు దిట్టంగా అమలు చేయడం తప్పనిసరని.. ప్రజలందరూ ఈ లాక్‌డౌన్‌కు సహకరిస్తే.. మే 11 తర్వాత కొత్త అంకాన్ని ప్రారంభించవచ్చని” అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ తెలిపారు. మే 11 తర్వాత దశలవారీగా విద్య, వ్యాపార సంస్థలు తిరిగి ప్రారంభించడానికి చర్యలు చేపడతామన్నారు. కానీ, బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలకు మాత్రం ఇప్పట్లో అనుమతులు ఇవ్వమని.. వాటిపై నిషేధం కొనసాగుతుందని అధ్యక్షుడు స్పష్టం చేశారు. కరోనాను ఎదుర్కోవాలంటే ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తేయడం సరైన నిర్ణయం కాబోదని.. నియంత్రణ చర్యలను చేపడుతూనే దశలవారీగా నిబంధనలు సడలిస్తామని ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా లాక్‌డౌన్ ఒకేసారి ఎత్తివేయొద్దని సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక వైరస్‌ను పూర్తిగా నాశనం చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే సరైన మార్గమని.. త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ వస్తుందనే నమ్మకం ఉన్నట్లు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags: france, lockdown, extend, president emmanuel macron, announced, coronavirus

Advertisement

Next Story