కేసీఆర్ ఫామ్ హౌజ్‌పై ‘ఈటెలు’

by Anukaran |
కేసీఆర్ ఫామ్ హౌజ్‌పై ‘ఈటెలు’
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసైన్‌మెంట్ భూముల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ తన బాణాన్ని కేసీఆర్ ఫామ్ హౌజ్‌పై ఎక్కుపెట్టారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో రోడ్లు వేసుకోడానికి అసైన్‌మెంట్ భూముల్ని వాడుకోలేదా అని ప్రశ్నించారు. వందల, వేల కోట్ల రూపాయలను పోగేసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు ఎర్రవల్లిలో వ్యవసాయ క్షేత్రం కొన్నప్పుడు భూముల ధరలను, ఇప్పుడు ఉన్న ధరల గురించి ఎందుకు మాట్లాడరు అని ఈటల ప్రశ్నించడం పరోక్షంగా కేసీఆర్‌కే సవాలు విసిరినట్లయింది.

కేసీఆర్ శిష్యరికంలో తాను కూడా ప్రజలనే నమ్ముకున్నానని చెప్తూనే ఇప్పుడు తన భూముల తరహాలోనే రాష్ట్రంలో ఆక్రమణలకు, ఉల్లంఘనలకు గురైన అన్ని అసైన్డ్ భూములపై ఇదే తరహాలో వేగవంతమైన విచారణ చేయించాలని తన మనసులోని మాటను బైటపెట్టారు. కేసీఆర్ ఒకసారి ఒక వ్యక్తిపైన దృష్టి పెడితే ఎంతటి కక్షపూరితంగా వ్యవహరిస్తారో తనకు తెలియంది కాదని, ఖతం పట్టేదాకా వదలరని, ఇప్పుడు అదే జరుగుతోందని, ఇంతకాలం ఆయనతో కలిసి పనిచేసిన తనకు ఇప్పుడు వేగంగా జరుగుతున్న పరిణామాలు తెలియందేమీ కాదన్నారు.

భూములపై మూడు రోజులుగా వరుసగా ఆరోపణలు చేస్తున్న కలెక్టర్, ప్రభుత్వ అధికారులు తనకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. వందలాది మంది పోలీసులు, అధికారులతో ఒక భయానక వాతావరణం సృష్టించి తన వివరణ తీసుకోకుండా, ప్రజలను దరిదాపుల్లోకి రానివ్వకుండా వ్యవహరించారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి ఎదురుచెప్పేవారు ఉండరు కాబట్టి ముక్కుసూటిగా వ్యవహరించే తనలాంటి వాడిపైన రాజ్యాన్ని, అధికారాన్ని వినియోగించుకుని కేసులు పెట్టే అధికారం ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed