ఉద్దీపనే ఉపశమనం..

by Shamantha N |

దిశ, న్యూస్ బ్యూరో : కరోనా వైరస్ వల్ల దేశంలో ఏర్పడ్డ ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి ద్రవ్య ఉద్దీపనే ఉపశమనాన్నిస్తుందని, అయితే ఉద్దీపన సైజు ముఖ్యం కాదని, దాని స్వరూపం ప్రధానమని 15వ ఆర్థిక సంఘం సలహా మండలి అభిప్రాయపడింది. సలహా మండలి సభ్యులు గురు, శుక్రవారాల్లో ఆన్‌లైన్‌లో సమావేశమై ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను ఆదాయం భారీగా పడిపోనుందని మండలి అంచనా వేసింది. అదే సమయంలో ప్రభుత్వాలు కరోనా మహమ్మారితో పోరాడేందుకు, సంక్షోభ సమయంలో పేదలను ఆదుకునేందుకు అధికంగా ఖర్చు పెట్టాల్సి రావచ్చని పేర్కొంది.

ఈ సమావేశం సందర్భంగా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికిగాను వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్న కొన్ని సూచనలను సలహా మండలి.. ఆర్థిక సంఘం దృష్టికి తీసుకొచ్చింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్యాకేజీ ప్రకటించడం, బ్యాంకింగేతర ఫైనాన్స్(ఎన్‌బీఎఫ్‌సీ) సంస్థలకు ప్రభుత్వ గ్యారంటీతో రుణాలిప్పించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటు పరిమితిని పెంచుకోవడానికి అనుమతించడం లాంటివి ఈ సూచనల్లో ఉన్నాయి. ఈ ఆర్థిక సలహా మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్, సాజిద్ చినాయ్, నీల్‌కాంత్ మిశ్రా తదితర ఆర్థిక వేత్తలు పాల్గొన్నారు.

Tags: 15th finance commission advisory council, online meeting, corona, lockdown, stimulus

Advertisement

Next Story

Most Viewed