ఈ ఏడాది దివాలా చట్టం ద్వారా రూ. 60 వేల కోట్ల వసూళ్లు..

by Harish |   ( Updated:2021-06-08 05:47:09.0  )
ఈ ఏడాది దివాలా చట్టం ద్వారా రూ. 60 వేల కోట్ల వసూళ్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దివాలా చట్టం(ఐబీసీ) కింద ఆర్థిక రుణదాతలు సుమారు రూ. 55,000 నుంచి రూ. 60,000 కోట్లను వెనక్కి రాబట్టే అవకాశం ఉన్నట్టు ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఐబీసీలో కింద కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ(సీఐఆర్‌పీ) ద్వారా ఆర్థిక రుణదాతలు రూ. 26 వేల కోట్లను మాత్రమే సాధించగలిగాయని ఇక్రా తెలిపింది. అంతకుముందు 2019-20లో వచ్చిన దాంట్లో ఇది నాలుగింట ఒక వంతేనని ఇక్రా అభిప్రాయపడింది. ‘తమ అంచనా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదిలోపు ఉన్న భారీగా పద్దులను పరిష్కరించడం ద్వారా ఎంత మొత్తం వస్తుందనే దాన్ని బట్టి ఈ మొత్తంలో మార్పు ఉంటుందని, భారీ పద్దుల వాటాయే 20 శాతం వరకు ఉండొచ్చని’ ఇక్రా ఉపాధ్యక్షుడు అభిషేక్ దఫ్రియా చెప్పారు.

అంతేకాకుండా, కొవిడ్ సెకెండ్ వేవ్ ప్రతికూల ప్రభావం నెమ్మదించకపోతే దివాలా పరిష్కార ప్రక్రియను అమలు చేయడంలో అంతరాయం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. దీనివల్ల ఆర్థిక రుణదాతలు ఎక్కువ నిధులను రాబట్టలేరు. కరోనా కారణంగా దివాలా పరిష్కార ప్రక్రియ నిర్వహణలో ఆటంకాలు పెరిగాయని, దీనివల్ల పరిష్కారం చేయాల్సిన కేసులు తగ్గిపోయినట్టు ఇక్రా వివరించింది. గతేడాది సైతం పూర్తిస్థాయిలో ఈ ప్రక్రియ ఆగిపోవడంతో పరిష్కారాలు నెమ్మదించినట్టు ఇక్రా పేర్కొంది.

ఇక్రా నివేదిక ప్రకారం.. 2016 డిసెంబర్ నుంచి మొత్తం 4,376 దివాలా పరిష్కార కేసులు విచారణకు రాగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి వాటిలో 2,653 కేసులు మాత్రమే పరిష్కరించబడ్డాయి. కొంత అవాంతరాలు ఉన్నప్పటికీ దివాలా చట్టం వల్ల ఎక్కువగా సానుకూల ప్రయోజనాలే ఉన్నాయని ఇక్రా స్పష్టం చేసింది. పరిష్కరించబడిన కేసుల్లో క్లెయిమ్ చేసిన మొత్తంలో సగటున 39 శాతం ఆర్థిక రుణదాతలకు అందింది. రానున్న రోజుల్లో దివాలా పరిష్కారానికి పట్టే సమయాన్ని తగ్గించడం, వేలం వేసే ఆస్తులపై మార్కెట్ వర్గాలకు ఆస్కతి పెరిగేలా చేయడం వంటి అంశాలు ఇప్పుడున్న కీలకమైన సవాళ్లని ఇక్రా వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed