తాడోపేడో తేల్చుకుంటాం.. టీఆర్ఎస్‌ ఓటమికి ఫీల్డ్ అసిస్టెంట్ల భారీ స్కెచ్

by Sridhar Babu |
huzurabad by poll
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : విధుల నుండి తొలగించబడ్డ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో దిగేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఈ ఉపఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించడమే కాకుండా తమ నినాదాన్ని బలంగా వినిపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన రోజునే రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 50 మంది చేత నామినేషన్లు వేయించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ ఈ మేరకు హుజురాబాద్‌లోనే మకాం వేసి, నామినేషన్లు వేసేందుకు అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటు చేసి నామినేషన్ల పర్వాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. వెయ్యి మందితో నామినేషన్లు వేయాలన్న లక్ష్యంతో వివిధ ప్రాంతాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లను సమాయత్తం చేస్తున్నారు. ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేస్తున్నందున ఒక్కొక్కరికి 10 మంది ఓటర్లు ప్రపోజల్ చేయాల్సి ఉన్నందున స్థానికంగా ఉన్న కులసంఘాలతో పాటు ఉద్యమాలకు చెందిన ప్రతినిధుల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు.

చర్చలకు పిలిచి…

ఫీల్డ్ అసిస్టెంట్లను చర్చలకు పిలిచిన అధికార పార్టీ నాయకులు జేఏసీ ప్రతిపాదనను తిరస్కరించడంతో నిరాశకు గురయ్యారు. ప్రత్యామ్నాయంగా పంచాయతీల్లో ఉపాధి కల్పిస్తామని చేసిన ప్రతిపాదనను ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యతిరేకించారు. ఈజీఎస్‌లోనే ఫీల్డ్ అసిస్టెంట్లుగా తిరిగి కొనసాగించాల్సిందేనని వారు పట్టుబట్టారు.

డిమాండ్ నెరవేరిస్తే ఓకే : శ్యామలయ్య

తమ డిమాండ్‌ను నెరవేరిస్తే బేషరుతుగా పోటీ నుండి తప్పుకుంటామని ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ ఛైర్మన్ శ్యామలయ్య ‘దిశ’కు తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలవుతున్న నేపథ్యంలో తమను యథావిధిగా కొనసాగించాల్సేందనని స్పష్టంచేశారు. ఈజీఎస్‌లో చాలా ఏళ్లుగా ఉపాధి పొందుతున్న తమను విధుల నుంచి తొలగించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గతంలో జరిగిన ఉపఎన్నికల సమయంలో కూడా తాము పోటీ చేస్తామని ప్రకటిస్తే మాట ఇచ్చారని, ఫలితాల తర్వాత తమను ఎవరూ పట్టించుకోలేదన్నారు. దీంతో తమను ఉద్యోగాల్లో తీసుకుంటేనే పోటీ నుండి తప్పుకుంటామని శ్యామలయ్య స్పష్టంచేశారు.

Advertisement

Next Story