రైతులను నిండాముంచిన అకాల వర్షం

by Shyam |   ( Updated:2021-05-03 11:27:19.0  )
రైతులను నిండాముంచిన అకాల వర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో : అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. చేతికొచ్చిన పంటలు వర్షం నీటిలో తడిసి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వర్షంతో భారీగా ధాన్యం తడిసిపోయింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం నీటిలో కొట్టుకొని పోయాయి. అత్యధికంగా వరంగల్ అర్బన్‌ జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో106.5 మి.మీ వర్షాపాతం నమోదుకాగా అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలోని బోధన్ మండలంలో 28.3 మి.మీ వర్షాపాతం నమోదైంది. రైతులకు మందుస్తుగా హెచ్చరికలు లేకపోవడంతో చాలా వరకు పంట నష్టపోయారు. కోనుగోలులు ఆలస్యంగా చేపట్టడం వలనే ఈ పరిస్ధితులు ఎదురవుతున్నాయి.

జిల్లాల వారీగా వర్షం వివరాలు..

వరంగల్ అర్బన్ జిల్లాలో ఎల్కతుర్తి మండలంలో 106.5 మి.మీ, కమలాపుర్ మండలంలో 75.5 మి.మీ, హసన్‌పర్తి మండలం చిన్నగట్టులో 73.5మి.మీ, నాగవరంలో 48.5 మి.మీ వర్షాపాతం నమోదైంది. జిల్లాల వారీగా ములుగులో 58.3 మి.మీ, నిర్మల్‌లో 49.3 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెంలో 49 మి.మీ నుంచి 30 మి.మీ, జయశంకర్ భూపాలపల్లిలో 48 మి.మీ, ఖమ్మంలో 42.5 మి.మీ, నిర్మల్‌లో 37.8 మి.మీ నుంచి 34మి.మీ, ఆదిలాబాద్‌లో 33.3 మి.మీ నుంచి 28.3 మి.మీ, వరంగల్ రూరల్‌లో 33మి.మీ, ములుగులో 31.5 మి.మీ నుంచి 28.8 మి.మీ గా వర్షాపాతం నమోదైంది.

కొనుగోలులో తగ్గిన వేగం..

ఈ ఏడాది యాసంగిలో కోటీ 32లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయి. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 6,408 కేంద్రాలు ఏర్పాటు చేసింది. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని వేగంగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగుల కేంద్రాల్లో సరిపడా స్థలం అందుబాటులో లేకపోవడంతో రైతులు పంటను కల్లాలోనే నిలువచేసుకుంటున్నారు. దీంతో వర్షం కురిస్తే భారీగా పంటను నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైతులకు పంట నష్టం జరుగకుండా సరిపడా గన్నీ బ్యాగులను ఏర్పాటు చేసి కొనుగోలు పనులు త్వరితగతిన చేపట్టాలని రైతులు కోరుతున్నారు. పంట.. చేలల్లో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40,000 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed