సీఎం సారు ఆ తీపి కబురు ఎప్పుడు చెప్తారు?

by Shyam |   ( Updated:2020-06-14 20:45:14.0  )
సీఎం సారు ఆ తీపి కబురు ఎప్పుడు చెప్తారు?
X

‘‘తెలంగాణ రైతాంగానికి త్వరలోనే నేను అతి పెద్ద తీపి కబురు చెప్పబోతున్న. ఆ ఫైనాన్స్ అంతా వర్కవుట్ అయింది. రాబోయే కొద్ది రోజుల్లోనే మంచి మాట… ప్రపంచంలోనే కాదు, ఇండియాలోనే ఎక్కడా రైతాంగానికి లేనటువంటి గొప్ప శుభవార్త అందించబోత. వెరీ షార్ట్ పీరియడ్‌లో. దాని కోసం అందరూ వేచి ఉండాలె. మీరు కూడా వేచి ఉండాలె. కొద్దిగా సస్పెన్స్‌ పెడదాం. ఒక వారం వరకు లెక్కాచారం తీసి… అందరూ అసలు భారతదేశమే ఆశ్చర్యపడి, అడ్డం పడే వార్త చెప్తాను. కాబట్టి ఆ విధంగా ముందుకు పోదాం’’
– ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (మే 29న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా)

దిశ, న్యూస్​బ్యూరో: సీఎం కేసీఆర్​ అందరినీ ఆశ్యర్యపరిచే ముచ్చట చెపుతానని రెండు వారాలు దాటిపోయింది. ఇంకా అబ్బుర పడే వార్త వెలువడలేదు. సస్పెన్స్ వీడలేదు. ఆ న్యూస్​ వినాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారం రోజుల్లోనే అనేది రెండు వారాలైనా జాడే లేదు. గతంలో ఎన్నో హామీలు ఇచ్చిన జాబితాలో ఇది కూడా చేరిపోయింది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు నీళ్లు రావడం, రెండు రోజుల క్రితం దానికి గండిపడడం, ఆ వార్త తెలుసుకున్న కేసీఆర్ హఠాత్తుగా స్పాట్‌కు వెళ్లి పరిశీలించడం జరిగిపోయాయి. కానీ, దేశమే అబ్బురపడేలాంటి తీపి వార్త మాత్రం ఇంకా బైటకు రాలేదు. ఆ అబ్బురపడే పథకం ఏంటో.. దానికి ఎంత ఖర్చవుతుందో లెక్కాచారం అంతా తీద్దామని కేసీఆర్ చెప్పిన తర్వాత రాష్ట్రంలో మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేల మధ్య రెండు మూడు రోజుల పాటు ఆసక్తికరమైన చర్చే జరిగింది. ఆ పథకం గురించి తమతో మాట్లాడినప్పుడు కూడా సీఎం ఎక్కడా బైటకు లీక్ చేయలేదని, మీడియాతో మాట్లాడుతున్నప్పుడే ఆ విషయం తెలిసిందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పేర్కొన్నారు. సీఎం మాటలను బట్టి రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలకంటే గొప్పగానే ఉంటుందనే అభిప్రాయం కలుగుతోందని అన్నారు. ఆ తీపి కబురు ఏంటో తెలియక రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి.

ఎన్నో ఊహాగానాలు..

పత్తి సాగును ఎక్కువగా చేయాలని రైతులకు పిలుపు ఇచ్చినందున విత్తనాలను ఉచితంగా సరఫరా చేస్తారేమోనని, మొత్తం పంటను ప్రభుత్వమే కొంటుందేమోనని, కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు కాటన్ కార్పొరేషన్ కొనుగోలు చేసినా దానికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ రూపంలో అదనంగా రైతులకు చెల్లిస్తుందేమోనని, చెప్పిన పంటను సాగుచేసిన రైతులకు ప్రోత్సాహకం ఇస్తుందేమోనని… ఇలా అనేక రకాల ఊహాగానాలు వెలువడ్డాయి. ఒక దశలో ఎలాగూ రెండు మూడు రోజులు గడిచిపోయింది.. ఇంకో నాలుగైదు రోజుల్లో ఆయనే స్వయంగా వెల్లడిస్తారుగదా… సస్పెన్స్‌గా ఉంచుదామని చెప్పారు కాబట్టి త్వరలోనే తేటతెల్లమవుతుందని కూడా అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.

పంటల సాగుపై క్లారిటీ లేదు..

సీఎం చెప్పిన సస్పెన్స్ రెండు వారాలైనా వీడలేదు. ఇంకా సస్పెన్స్‌గానే ఉండిపోయింది. అబ్బురపడే వార్త సంగతేమోగానీ తొలకరి జల్లులు కురవడం, నాట్లు వేయడం మొదలైనా ఇంకా రైతుబంధు సాయం అందలేదని, నియంత్రిత సాగు విధానమేంటో తెలియక ఏ పంట సాగుచేయాలో తేల్చుకోలేక రైతులు సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న సీఎం ఆదివారం జిల్లాల కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. నియంత్రిత సాగు విధానాన్ని వెల్లడించాల్సి ఉంది. కరోనా కేసులు పెరుగుతున్నందున భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో చర్చించే కార్యక్రమం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాని మోడీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్సు సమావేశంలో బుధవారం సీఎం పాల్గొనాల్సి ఉంది. ఈ షెడ్యూలు నడుమ సస్పెన్స్‌కు తెరదించే తీరులో అబ్బురపోయే వార్త ఎప్పుడు వెలువరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

నిధుల సర్దుబాటు కోసమే లేటా..

అబ్బురపడే పథకానికి అయ్యే ఖర్చు లెక్కలు ఎట్లున్నా కేంద్రం నుంచి మాత్రం జీఎస్టీ పరిహారం కింద ₹3,975 కోట్లు ఏప్రిల్, మే మాసాలకు రావాల్సి ఉందని, వెంటనే దాన్ని విడుదల చేయాలని జీఎస్టీ కౌన్సిల్ వీడియో కాన్ఫరెన్సు సమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి తోడు జూన్ మాసానికి రావాల్సిన డివొల్యూషన్ (కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా)ను కూడా విడుదల చేయాలని కోరారు. తీపి కబురు పథకం కోసం ఖర్చయ్యే లెక్కలన్నీ ఆరా తీసిన తర్వాత దాన్ని సర్దుబాటు చేసుకోడానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతుందా లేక స్వీయ ఆర్థిక వనరుల నుంచి సమకూర్చుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed