- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మామిడి’ని ఆదు‘కొనేవారులేరు’!
దిశ, మహబూబ్ నగర్: వేసవి కాలం వచ్చిందంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది నోరూరించే మామిడి పండ్లు. అదే విధంగా మనిషిలో కొంత నీరసాన్ని తగ్గించే బత్తాయి రసం. కానీ, ఈ రెండు పంటలు సాగు చేసిన రైతాంగం పరిస్థితి నేడు అగమ్యగోచరంగా తయారైంది. పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ మామిడిపండ్ల రుచి, వాటికి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ప్రాంతం నుంచి మామిడి పండ్లు దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈసారి మాత్రం పరిస్థితులు ఇక్కడి రైతులకు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఒక వైపు ప్రకృతి కన్నెర్ర చేయడంతో నష్టపోయిన మామిడి రైతాంగానికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ మరింత నష్టాని తెచ్చి పెడుతున్నది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా పూర్తిగా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఈ కారణంగా ఈ ప్రాంతం నుంచి మామిడి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయి రైతులు నష్టాల ఊబిలో కురుకుపోయారు. కనీసం గిట్టుబాటు ధరతోపాటు మార్కెటింగ్ సౌకర్యం కూడా లేకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే అధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో మామిడి తోటలు సాగు చేశారు. సుమారు 26 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వనపర్తి జిల్లాలో సైతం సుమారు 12 వేల ఎకరాలు, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో సైతం మామిడి తోటల సాగు ఇటీవల ఊపందుకున్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ పరిసర ప్రాంతాల నుండి ముంబాయి, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్‌తోపాటు విదేశాలకు సైతం మామిడి పండ్లను ఎగుమతి చేస్తుంటారు. లాక్‌డౌన్ కారణంగా ఈసారి దిగుబడులు వస్తున్న సమయంలో కూడా కాయలను తీసుకెళ్లేందుకు వ్యాపారులు ఎవ్వరూ కూడా ముందుకు రాకపోవడంతో తప్పని పరిస్థితిలో కేవలం హైదరాబాద్‌లోని కొత్తపేట్ మార్కెట్‌కు తరలించాల్సి వస్తోన్నది.
గత రెండు రోజుల క్రితం ప్రభుత్వం సెర్ప్ ఆధ్వర్యంలో మామిడి కొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పింది. కానీ, అది కేవలం నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలానికే పరిమితం అయ్యింది. ఇక్కడ కూడా ధరలు అశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోన్నది. ఇప్పటికే అకాల వర్షాల కారణంగా చాలామంది రైతులు తోటల్లో మామిడికాయలు నేల రాలగా పంట ఆరంభంలో ఉండే ధరలు ఈసారి లేకపోవడం వారిని ఉసూరుమనిపిస్తోన్నది. గతేడాది ఇదే సమయంలో క్వింటాల్ కు రూ.7 వేలు పలికిన మామిడి ఈ ఏడాది సగానికి సగం పడిపోయి రూ.3 వేలు కూడా రావడం లేదని వాపోతున్నారు.
సెర్ప్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 33 బృందాలు మామిడి కొనుగోళ్లు చేసి వాటిని మేడ్చల్ లోని కోల్డ్ స్టోరేజ్‌కు తరలిస్తున్నారు. అయితే వనపర్తి తదితర ప్రాంతాల్లో సెర్ప్ బృందాలు లేకపోవడంతో వారు పండించిన పంటలను పెద్దకొత్తపల్లికి తరలించేందుకు అనుమతి ఇస్తామని లేదా హైదరాబాద్ తరలించేందుకు అనుమతిస్తామని అక్కడి అధికారులు చెబుతున్నారు. అంతదూరం తరలించిన కూడా ఆశించిన మేరకు ధరలు లేకపోవడంతో తమకు నష్టం వచ్చే పరిస్థతి ఏర్పడిందని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పంట కోత దశకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే సడలింపులు ఇస్తే తమ మామిడి పంటలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తేనే తమకు లాభాలు వస్తాయని లేదా ఈ ఏడాది నష్టపోక తప్పదని వారు ఆందోళన చెందుతున్నారు. గత మూడు సంవత్సరాలలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తోటల పెంపకం కూడా అధికం కావడంతో ఈ ఏడాది మామిడి దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది.
రోడ్లపైనే బత్తాయి విక్రయం
ఇటీవల కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు మనిషి తన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తరఫున అవసరం అయితే కొంటామని సీఎం ప్రకటించారు. ఏ జిల్లాలో సాగు చేసిన పండ్లను అదే జిల్లాలో అందుబాటులో ఉండేవిధంగా చూడాలని ఆదేశించారు. అటు సీఎం ఆదేశాలతోపాటు ఇటు రవాణా సౌకర్యాలు కూడా లేకపోవడంతో బత్తాయి సాగు చేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బత్తాయి కొనేవారు లేక చివరకు రైతులే రోడ్లపైకి వచ్చి వాటిని విక్రయించే పరిస్థితి నెలకొంది. గతంలో రూ.10కి ఒక పండును విక్రయిస్తే ఈసారి మాత్రం రూ.10కె 3 పండ్లు అమ్మాల్సి వస్తోందని అంటున్నారు. హైదరాబాద్ మార్కెట్లో కూడా వీటికి ధరలు లేకపోవడం వల్ల దళారులు కూడా కొనేందుకు ముందుకు రావడంలేదని వారు వాపోతున్నారు.
Tags: Mahabubnagar, fruit, mangoes, farmers, trouble