కరోనా నింపిన విషాదం.. పెండ్లయిన నాలుగేండ్లకే..

by Anukaran |   ( Updated:2021-06-17 21:06:47.0  )
కరోనా నింపిన విషాదం.. పెండ్లయిన నాలుగేండ్లకే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: 28 ఏండ్ల యువ‌కుడి(ఇంటి పెద్ద)ని బ‌లి తీసుకొని భార్య, ప‌సి పిల్లల‌ను దిక్కులేని వాళ్లను చేసింది కరోనా. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఈ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న వెలుగుచూసింది. కొత్తూరు మున్సిపాలిటీలో నివాసం ఉండే బ‌ద్దుల రాజు (28) సొంతూరు షాద్‌న‌గ‌ర్‌. సొంత ఇల్లు, ఉపాధి అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో కొత్తూరులో అద్దె ఇల్లు తీసుకొని ఉన్నాడు. స్థానిక ఫ్యాక్టరీల్లో దిన‌స‌రి కూలీగా ప‌నిచేసేవాడు. అత‌డికి భార్య అలేఖ్య (24), కుమారులు ప్రణీత్ (3), హ‌ర్షిత్ (2). క‌రోనా మొద‌టి వేవ్‌లోనే ప‌నిచేసే ఫ్యాక్టరీ నుంచి అత‌డిని తీసేశారు. దీంతో ఏ ప‌ని దొరికితే అది చేసి ఇంటి అవ‌స‌రాలు తీర్చేవాడు. స‌రైన ప‌నిలేక‌పోవ‌డంతో అప్పుజేసి ఇంటి కిరాయి క‌ట్టిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి.

పిల్లల్ని పంపించాడు

తాత్కాలికంగా ప‌నిచూసుకొని పొట్టపోసుకుంటున్న రాజుకు సెకండ్ వేవ్ శాపంగా మారింది. లాక్‌డౌన్ వ‌ల్ల ప‌నిలేక ఇంట్లోనే ఉండేవాడు. క‌రోనా విజృంభించ‌డం, ఉపాధి లేక‌పోవ‌డంతో రాజు కుటుంబం తీవ్ర ఇబ్బందుల‌కు గురైంది. కాల‌నీలో చాలామందికి క‌రోనా రావ‌డంతో ముందు జాగ్రత్తగా భార్య, పిల్లల్ని పుట్టింటికి పంపించాడు. ప‌క్కింట్లో ఉండే వాళ్లకు పాజిటివ్ వ‌చ్చింద‌ని క‌షాయం తాగ‌డం, ఆవిరి ప‌ట్టడం లాంటి జాగ్రత్తలు తీసుకునేవాడు. ఏమైందో ఏమో ఉన్నట్టుండి గ‌త నెల 28వ తేదీన అస్వస్థత‌కు గుర‌య్యాడు. కొవిడ్ ల‌క్షణాలే లేక‌పోవ‌డంతో వేరే స‌మ‌స్య ఉండొచ్చు అనుకున్నారు. విష‌యం భార్యకు ఫోన్ చేసి చెప్పి మ‌రుస‌టి రోజు అలేఖ్య త‌ల్లిగారి ఊరైన కేశంపేట మండ‌లం చౌల‌ప‌ల్లికి వెళ్లాడు.

గాంధీకి వెళ్లేందుకు సిద్ధం

వైద్య ప‌రీక్షల కోసం 30వ తేదీన త‌న మామ‌ను తీసుకొని రాజు షాద్‌న‌గ‌ర్ వెళ్లాడు. హెచ్ఆర్‌సీటీ త‌ప్పనిస‌రి అని డాక్టర్ చెప్పడంతో ఆ ప‌రీక్ష చేయించుకున్నాడు. క‌రోనా పాక్షిక ల‌క్షణాలు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్ పెద్దాసుప‌త్రిలో చికిత్స చేయించుకోవాల్సిందేనని స‌ల‌హా ఇచ్చారు. కొద్దిసేప‌టికే శ్వాస తీసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డుతుండ‌టంతో ఒక ప్రైవేటు హాస్పిట‌ల్‌ను సంప్రదించారు. త‌క్షణ చెల్లింపు కింద రూ.ల‌క్ష చెల్లిస్తే వెంట‌నే చికిత్స ప్రారంభిస్తామ‌ని హాస్పిట‌ల్ వాళ్లు చెప్పడంతో అప్పటిక‌ప్పుడు అంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి తేవాలి? పొద్దున్నే గాంధీ హాస్పిట‌ల్‌కి వెళ్దామ‌ని మామ కృష్ణయ్య, త‌ల్లి ప‌ద్మమ్మకు చెప్పాడు రాజు. తెల్లారితే ఎలాగూ గాంధీ హాస్పిట‌ల్‌కు వెళ్తాం క‌దా? శ్వాస‌కు ఇబ్బంది అవుతున్నది. మ‌ళ్లీ చౌల‌ప‌ల్లి ఎందుకు అని షాద్‌న‌గ‌ర్‌లో త‌న త‌ల్లి అద్దెకు ఉండే ఇంట్లో ఉన్నాడు. స‌మ‌స్య ఎక్కువ అవ‌డంతో 31వ తేదీ రాజు చ‌నిపోయాడు. మున్సిపాలిటీవాళ్లు వ‌చ్చి అదేరోజు రాత్రి అంత్యక్రియ‌లు జ‌రిపించారు.

దిక్కులేని వాళ్లయ్యారు

రాజుకు సొంత ఇల్లులేదు. సంపాదించిన ఆస్తులూ లేవు. కాయ‌క‌ష్టం చేసుకొని బ‌తుకుతా అనే ఆత్మవిశ్వాసం ఒక్కటే ఉండేది. అత‌డి ధైర్యమే త‌న భార్య ధైర్యం. ఇప్పుడు భ‌ర్త లేడు. నిలువ నీడ‌లేదు. తానే ఓ చిన్న అమ్మాయిని అంటే ఇప్పుడు త‌న‌కో ఇద్దరు ప‌సి పిల్లలు. వాళ్లను ఎలా పోషించాలి? ఎలా బ‌త‌కాలి? ఎక్కడ ఉండాలి? అని అలేఖ్య క‌న్నీరు మున్నీరు అవుతోంది. మమ్మీ డాడీ హాస్పిట‌ల్ నుంచి ఇంకా ఎప్పుడొస్తాడు అని త‌న తండ్రి గురించి పిల్లలు అడుగుతుంటే అలేఖ్య వాళ్లకు ఏం స‌మాధానం చెప్పాలో అర్థంకాక త‌ల్లడిళ్లుతోంది. రాజు తండ్రి గ‌తంలో చ‌నిపోగా త‌ల్లి షాద్‌న‌గ‌ర్‌లో కిరాయి ఇంట్లో ఉంటూ కూలీ ప‌నిచేస్తోంది. ఇద్దరూ మొద‌లు లేని చెట్టువ‌లె శోకిస్తుంటే ఆప‌డానికి ఎవ‌రి త‌ర‌మూ కావ‌డం లేదు.

క‌ష్టంజేసుకొని బ‌తుకుతం క‌దా అనుకున్న: బ‌ద్దుల అలేఖ్య

నేను ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దువుకున్నా. మా పెండ్లయి నాలుగేండ్లు అవుతోంది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకున్నా.. క‌ష్టంజేసుకొని బ‌తుకుతం క‌దా అనుకున్నాం. కానీ ఇట్లా మ‌మ్మల్ని మ‌ధ్యలో వ‌ద‌లేసిపోతాడు అనుకోలేదు. ఇప్పుడు నేనెట్లా బ‌త‌కాలె? నా పిల్లల్నెలా బ‌తికించాలె? మామ‌ లేడు, భ‌ర్తలేడు. ఇద్దరం ఆడోళ్లం.. మాతో ఇద్దరు పసిపిల్లలు. ప్రభుత్వం ఆదుకొని మాకొక ఇల్లు క‌ట్టిస్తే ఇంత నీడైనా దొరుకుతుంది.

Advertisement

Next Story