యూట్యూబ్‌లో చూసి దొంగనోట్లు తయారీ.. పట్టించిన చికెన్ పకోడీ 

by Anukaran |   ( Updated:2021-09-28 07:57:34.0  )
యూట్యూబ్‌లో చూసి దొంగనోట్లు తయారీ.. పట్టించిన చికెన్ పకోడీ 
X

దిశ, రాయలసీమ: యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు ముద్రిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన నూర్ బాషా పాల వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా నిర్వహిస్తూ ఉండేవాడు. ఈనెల 25న పనిమీద కర్నూలు జిల్లా మద్దికెర మండలం జొన్నగిరికి వెళ్లాడు. అక్కడ ఒక షాపులో చికెన్ పకోడి కొనుక్కుని తిందామనుకున్నాడు. లోకల్‌గా ఉన్న నాన్ వెజ్ షాప్‌కు వెళ్లి చికెన్ పకోడీ తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న వంద రూపాయలు నోటు ఇచ్చాడు. అది చూసిన షాపు యజమాని నకిలీదని గుర్తుపట్టి ఆ నోటు వద్దని ఇంకో నోటు ఇవ్వమని కోరాడు. నా దగ్గర అదే ఉందని ఇంకోకటి లేదని చెప్పాడు. ఈ క్రమంలో అక్కడే ఉండి వీరి మాటలు విన్న కానిస్టేబుల్ నూర్ బాషాను పట్టుకుని తనిఖీ చేశాడు. అతని దగ్గర ఇంకో మూడు వేల రూపాయల దొంగ నోట్లు దొరికాయి. దీంతో అతడిని జొన్నగిరి పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు.

పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా దొంగనోట్ల తయారీ విషయం బయటపడింది. యూట్యూబ్ ద్వారా నకిలీ నోట్ల తయారీ విధానం నేర్చుకుని మరో ఇద్దరితో కలిసి దొంగనోట్లు తయారు చేసినట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. గుంతకల్లు, మద్దికెర, జొన్నగిరి తదితర ప్రాంతాల్లో నోట్లు మార్పిడి చేసినట్లు వివరించాడు. రూ. 50 వేల అసలైన నోట్లు తీసుకుని లక్ష రూపాయల నకిలీ నోట్లను అందచేయటంతోపాటు తాము కూడా స్వయంగా వాటిని మార్కెట్ లో పంపిణీ చేసినట్లు తెలిపాడు. పోలీసులు నూర్ బాషాను వెంటబెట్టుకుని కసాపురానికి వెళ్లి అతని ఇంట్లో దొంగనోట్ల తయారీకి సంబంధించిన స్కానర్, జిరాక్స్ మిషన్, నోట్ల తయారీలో ఉపయోగించే పేపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నోట్ల తయారీకీ సహకరించిన ఖాజా, ఎస్. ఖాసీంలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story