ఎన్నికలపై ఫ్యాక్షన్ ​నీడలు! మాకే ఓటేయరా..?

by Anukaran |
ఎన్నికలపై ఫ్యాక్షన్ ​నీడలు! మాకే ఓటేయరా..?
X

దిశ, ఏపీ బ్యూరో : ప్రతీ నెలా పింఛనుపై ఆధారపడ్డ పండుటాకులెన్నో. ఇప్పుడు వాళ్లకు పెద్ద కష్టమే వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుదార్లకు ఓటేయలేదంటూ వలంటీర్లు పింఛను ఆపేశారు. అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం మండలం గోళ్ల, నార్సల మండలం దుగుమర్రి, పెదవడుగూర మండలం మజరా కొండూరుకు చెందిన ప్రజలు సోమవారం ఆయా మండల కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. అధికారులు విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

వాస్తవానికి వాళ్లు ఎవరికి ఓటేశారో వాళ్లకు మాత్రమే తెలుసు. అధికార పార్టీ మద్దతుదారుడు ఓడిపోయినంత మాత్రాన ఫలానా వాళ్లు ఓటేయలేదని ఎలా నిర్ధారిస్తారు ! అయినా వాళ్లకు ఓటేయకుంటే పింఛను ఆపేస్తారా ! ఇది ఇంతటితో ఆగలేదు.తాజాగా మున్సిపల్​ఎన్నికల్లో పోటీ చేసిన విపక్షాల అభ్యర్థులను బెదిరించడంతో ఊరొదిలి వెళ్లిపోయారు. ఎక్కడో కర్నాటకలో తలదాచుకున్నారు. రాయదుర్గం మున్సిపాలిటీ బరిలో ఉన్న దాదాపు 14 మంది టీడీపీ అభ్యర్థులు రహస్య ప్రదేశాలకు తరలిపోయారు. వాళ్లు ఎక్కడున్నారో చెప్పాలంటూ బంధువులను వేధిస్తున్నట్లు ఆయా పార్టీల నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కర్నూలు జిల్లాలో భూమా అఖిలప్రియ ఎస్ఈసీ దృష్టికి తీసుకొచ్చారు.

చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఇళ్లకు తాళాలు వేసి ఎటో వెళ్లిపోయారు. విత్​డ్రా గడువు ముగిశాక వస్తామని ఫోన్లు స్విచ్​ఆఫ్​చేసుకున్నారు. ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు నెలకొనడం వల్లే తిరుపతిలో ఆరు, పుంగనూరులో మూడు, రాయచోటిలో రెండు మున్సిపల్​వార్డుల్లో ఏకగ్రీవాలను ఎస్ఈసీ రద్దు చేసింది. మంగళవారం మధ్యాహ్నం మూడున్నరలోగా నామినేషన్లు వేయొచ్చని ఆదేశించింది. ప్రజల చైతన్యం పెరగకపోవడం, తీవ్ర అసమానతల వల్లే ప్రజాస్వామ్యం ఫ్యాక్షన్​పడగ నీడలో వర్ధిల్లుతోంది.

Advertisement

Next Story

Most Viewed