ఖబర్దార్ కేసీఆర్.. ఈటల హెచ్చరిక

by Sridhar Babu |   ( Updated:2021-06-09 06:47:09.0  )
ఖబర్దార్ కేసీఆర్.. ఈటల హెచ్చరిక
X

దిశ, జమ్మికుంట: కుటుంబ సభ్యులలాగా కలిసి ఉన్న హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలపై కొందరు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇక్కడి ప్రజలు అలాంటి వారిని పసిగట్టే పనిలో ఉన్నారని, అలా చేస్తే చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. బుధవారం ఈటల రాజేందర్ వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ నుండి ఇల్లందకుంట మండల కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంలో ఈటల వర్గీయులు భారీ ఎత్తున ఘనస్వాగతం పలికారు. ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓ ఇంటిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడారు. గొర్ల మందుల మీద తోడేళ్ళు పడ్డట్టు కొందరు ఎమ్మెల్యేలు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారన్నారు.

గతంలో జరిగిన ఎన్నికల్లో ఏనాడు ఇటువైపు చూడకపోగా.. కనీసం ఐదు పైసల సహాయం చేయనివారు నేడు ప్రజలపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఈటల ఘాటుగా మాట్లాడారు. ఎమ్మెల్యేలకు ప్రజలు ఓట్లు వేసింది దాడులు చేసేందుకు కాదని, దీన్నంతటినీ ప్రజలు చూస్తున్నారని, సమయం వచ్చినప్పుడు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వెల్లడించారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న ఈ తతంగం అంతా అలంపూర్ నుండి ఆదిలాబాద్ జిల్లా కౌటాల వరకు, కొత్తగూడెం నుండి వికారాబాద్ వరకు అన్ని జిల్లాల ప్రజానీకం గమనిస్తున్నారన్నారు. తన నియోజవర్గంపై మిడతల దాడి చేస్తున్న విషయాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ధర్మ, కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని, ధర్మానికి, అధర్మానికి మధ్య, న్యాయానికి, అన్యాయానికి మధ్య యుద్ధం జరగబోతుందన్నారు.

ఈ యుద్ధంలో ఆనాడు పాండవుల గెలిచినట్లు ఈనాడు హుజురాబాద్ ప్రజలు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా, అక్కడ కేసీఆర్ వరాలు కురిపించి పనులు ఇచ్చే సాంప్రదాయం ఉందని, నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. 2018 ఎన్నికల సందర్భంలో ఉద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేశారని, ఇప్పటికైనా నిరుద్యోగ యువతకు రూ. 3 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ జమ్మికుంట మండలంలోని వావిలాల, వీణవంక మండలంలోని చల్లూరు గ్రామాలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని తాను దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ లు నిర్వీర్యం అయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి మండలానికి రూ.10 కోట్లు, గ్రామాలకు యాభై లక్షల నుండి కోటి రూపాయల వరకు నిధులు మంజూరు చేయాలని అన్నారు.

నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల పనులకు వెంటనే నిధులను విడుదల చేయాలని కోరారు. తాను కొత్త పార్టీ పెడుతున్నానని, పార్టీ మారుతున్నానని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపారని, గొంతు కోయాలని చూశారని, ప్రాణం ఉన్నప్పుడే బొంద పెట్టాలని కేసీఆర్ చూశారన్నారు. అదే బొందలో ప్రభుత్వం పడటం ఖాయమని జోస్యం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed