నాలుగు ఓట్లకే లక్ష.. ఈటల సంచలన వ్యాఖ్యలు

by Shyam |
నాలుగు ఓట్లకే లక్ష.. ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, కమలాపూర్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్‌లో సోమవారం పెరిక ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఈటల మాట్లాడుతూ… ‘నా మిత్రుడు హరీష్ రావు నన్ను ఓడించేందుకు సింగపూర్‌లో కూర్చుని కుట్రలు చేస్తున్నాడు’ అని ఈటల ఆరోపించారు. రాష్ట్రంలో దసరా పండుగ జరుపుకోవడానికి మరో 20 రోజులు ఉందని, కానీ హుజురాబాద్ ప్రజలకు మాత్రం నాలుగు నెలలుగా దసరా పండుగే జరుగుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే ప్రలోభాలు చూసి హుజురాబాద్ ప్రజలు సిగ్గుపడుతున్నారని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ సర్పంచ్‌లకు బిల్లులు ఇచ్చినట్లుగా యావత్ తెలంగాణలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల సర్పంచ్‌లు బిల్లులు రాక బాధపడుతున్నారని అన్నారు. కేసీఆర్‌కు సర్పంచ్‌, ఎంపీటీసీలు అంటే గౌరవం లేదని, కేవలం ఎన్నికల కోసమే ప్రేమ కురిపిస్తున్నారని ఆరోపించారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు కేసీఆర్ వద్ద ఎలాంటి వ్యాపారాలు లేవని, కానీ ఇప్పుడు ఒక్క హుజురాబాద్ నియోజకవర్గానికే రూ.200 కోట్లు ఖర్చు చేశారని, మరో రూ.500 కోట్లు ఖర్చు చేయడానికైనా రెడీగా ఉన్నారని అన్నారు. అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బు అని, దీనిపై భవిష్యత్తులో కేసీఆర్‌ను బోనులో నిలబెట్టే పరిస్థితి వస్తుందని విమర్శించారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఇక్కడికి వచ్చే నాయకులు ఫ్లెక్సీలు, హోర్డింగుల్లో ఉన్నారు కానీ, ఈటల హుజురాబాద్ ప్రజల గుండెలో స్థానం సంపాదించుకున్నాడని అన్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఒక ఓటుకు రూ. 20 నుంచి రూ.30 వేలు ఇస్తారని, ఒక కుటుంబంలో నాలుగు ఓట్లు ఉంటే లక్ష రూపాయలు ఇవ్వడానికైనా టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నారని సంచలన ఆరోపణ చేశారు. నియోజకవర్గంలో 20 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధి తన రాజీనామా వల్ల కొన్ని నెలల్లోనే జరుగుతోందని, దీనిని ప్రజలు గమనించాలని సూచించారు. ఉద్యమ బిడ్డగా పోరాడాను, ఎమ్మెల్యే, మంత్రిగా మీకు సేవ చేశానని, రాబోయే ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed