దామగుండం అడవుల్లో ‘నేవీ రాడార్ కేంద్రం’చిచ్చు..

by Shyam |
దామగుండం అడవుల్లో ‘నేవీ రాడార్ కేంద్రం’చిచ్చు..
X

దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లా దామగుండం అడవి ప్రాంతంలో మరోసారి అలజడి రేగుతోంది. ఈ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేవీ రాడార్ కేంద్రమే ఈ అలజడికి కారణం అవుతోంది. హిందు మహా సముద్రంలో సంచరించే నౌకల కదలికలు, సంకేతాలను గుర్తించేలా ఈ రాడార్ సెంటర్ ఏర్పాటు కానుంది. అయితే దాని ద్వారా వెలుబడే అధిక రేడియేషన్‌తో జీవజాతులకు ప్రమాదం ఉందని జిల్లా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

రెండేళ్ల క్రితం దామగుండం అడవి ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు రంగం చేసింది. అయితే దానిని వ్యతిరేకిస్తూ.. పర్యావరణ వేత్తలు, దామగుండం అటవీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైకోర్టుకు వెళ్లారు. దీనిపై అప్పట్లో హైకోర్టు స్టే విధించింది. తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు.. నేవీ రాడార్ ఏర్పాటుపై విధించిన స్టేటస్ కో తొలగిస్తూ తీర్పు చెప్పింది. దీంతో మళ్లీ నేవీ రాడార్ కేంద్ర ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దీనిపై ఆందోళనలు చేయడానికి జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు.

అంతా తప్పుడు లెక్కలే..

న్యాయస్థానానికి దేవాదాయ, అటవీ శాఖలు తప్పుడు నివేదికలు ఇవ్వడంతోనే కోర్టు స్టేటస్ కో తొలగించినట్లు దామగుండం అటవీ పరిరక్షణ సమితి ఆరోపిస్తోంది. జిల్లాలోని పూడూరు మండలంలో విస్తరించి ఉన్న దామగుండం అటవీ ప్రాంతంలో 90 శాతం వృక్ష సంపద ఉండగా.. కేవలం 0.4 శాతమే అడవి ఉన్నదని, ఒక్క వణ్యప్రాణి కూడా లేదని అటవీ శాఖ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని ఆరోపిస్తున్నారు. కానీ డిస్కవరీ ఏ న్యూ వరల్డ్ ఆఫ్ బర్డింగ్ సంస్థ చేసిన సర్వేలో 152 రకాల అపూర్వమైన పక్షులు, జింకలు, ఇతర వణ్యప్రాణులు ఉన్నట్లు తేలిందని ఆ సంస్థ సభ్యులు పేర్కొంటున్నారు.

దేవాదాయ శాఖది అదే దారి..

దామగుండం అడవీలో 13వ శతాబ్దం నాటి పుణ్యక్షేత్రం భక్తులతో విరాజిల్లుతుండగా.. దేవదాయ శాఖ మాత్రం అక్కడికి భక్తులు ఎవరూ రావడం లేదని తప్పుడు నివేదికలు ఇచ్చిందని మండిపడుతున్నారు. నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు అధికారులు సహకరిస్తూ.. ఈ ప్రాంతంలో జీవన మనుగడను ప్రమాదంలో నెట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాడార్ కేంద్రం ప్రారంభం అయితే 50 నుంచి 100 కిలో మీటర్ల వరకు రేడియేషన్ ప్రభావం ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీని వల్ల మనుషులతోపాటు ఇతర వణ్యప్రాణులు అంతరించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. దీనిపై జిల్లా ప్రజలు, పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు పోరాటం చేయాలని దామగుండం అటవీ పరిరక్షణ సమితి పిలుపునిస్తోంది.

Advertisement

Next Story